Red Diary Warning To CM : రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన రాజేంద్ర సింగ్ గూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన వెంటనే.. తనను మంత్రి పదవి నుంచి తప్పించిన సీఎం అశోక్ గెహ్లాట్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
కన్నీళ్లుపెడుతూ మీడియాతో మాట్లాడిన రాజేంద్ర సింగ్ గూడా.. “రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో నడుస్తున్న చీకటి వ్యాపారాలపై నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఆ మొత్తం చిట్టా నా చేతుల్లో ఉంది. దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన చీకటి దందాపై నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది” అని ఆరోపించాడు.
సీఎం గెహ్లాట్ ఫోన్ చేసి ‘రెడ్ డైరీ’ దాచమని చెప్పారు
“కాంగ్రెస్ నాయకుడు ధర్మేంద్ర రాథోడ్‌పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) రైడ్స్ జరిగిన టైంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశాల మేరకు నేను ఒక “రెడ్ డైరీ”ని దాచాను. అప్పుడు సీఎం గెహ్లాట్ నాకు ఫోన్ చేసి ‘రెడ్ డైరీ’ని ఎలాగైనా దాచమని చెప్పారు. ఆ డైరీని తగులబెట్టారా ? లేదా ? అని ఆ తర్వాత ముఖ్యమంత్రి నన్ను పదే పదే అడిగారు. అందులో భయపెట్టే అంశాలే లేకుంటే సీఎం గెహ్లాట్ అలా మాట్లాడి ఉండేవారు కాదు” అని రాజేంద్ర సింగ్ గూడా కామెంట్ చేశారు. అవినీతి కేసుల వివరాలతో కూడిన ఆ “ఎరుపు డైరీ”(Red Diary Warning To CM) తన దగ్గరే ఉందన్నారు. ఆ డైరీని తాను బయటపెడితే సీఎం గెహ్లాట్ జైలుకు వెళతారని ఆయన వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
Also read : Baby Movie : 10 రోజులు అవుతున్న బాక్స్ ఆఫీస్ వద్ద బేబీ హావ తగ్గట్లే
నాపై లాఠీచార్జి చేశారు
రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని కామెంట్ చేసి ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన రాజేంద్ర సింగ్ గూడా.. మళ్ళీ మీడియా ముందు అదే విషయాన్ని ప్రస్తావించారు. “రాష్ట్రంలో మహిళల హక్కుల గురించి నేను అసెంబ్లీలో ప్రశ్నించే ప్రయత్నం చేస్తే నాపై లాఠీచార్జి చేశారు. దాదాపు 50 మంది నాపై దాడి చేశారు. తన్ని తరిమికొట్టారు. కాంగ్రెస్ నేతలు నన్ను అసెంబ్లీ నుంచి ఈడ్చి పడేశారు. అసలు నా తప్పు ఏమిటో చెప్పండి?” అని రాజేంద్ర సింగ్ గూడా ప్రశ్నించారు.