Robert Vadra : తాను ఇక రాజకీయాల్లోకి వస్తానని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రకటించిన కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హర్యానా రాష్ట్రం శిఖోపూర్‌కు చెందిన ఒక స్థలం లావాదేవీ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలను రాబర్ట్ వాద్రా ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తమ ఎదుట హాజరుకావాలంటూ రాబర్ట్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణను ఎదుర్కొనేందుకు ఈరోజు ఈడీ ఆఫీసుకు వెళ్లే క్రమంలో రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ల్యాండ్ డీల్‌లో స్కాం చేశానని రాజకీయ దురుద్దేశంతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజల గురించి మాట్లాడేందుకు నేను ప్రయత్నించినప్పుడల్లా అణచివేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. నేను దాచడానికి ఏం లేదు. ఈడీ అధికారులు నన్ను ఏ ప్రశ్నైనా అడగొచ్చు. తప్పకుండా సమాధానాలు ఇస్తాను’’ అని ఆయన చెప్పారు. ఇంతకుముందు ఇదే నెల (ఏప్రిల్) 8న వాద్రాకు ఈడీ సమన్లు పంపింది. వాటికి ఆయన స్పందించలేదు. దీంతో మళ్లీ ఇప్పుడు సమన్లు పంపింది. ఈసారి రాబర్ట్ వాద్రాకు విచారణకు హాజరవుతున్నారు.
Also Read :Robert Vadra : నేనూ పార్లమెంటుకు వెళ్తా.. రాబర్ట్ వాద్రా కీలక ప్రకటన
రాబర్ట్ వాద్రాపై అభియోగం ఏమిటి ?
ఇంతకీ ఈడీ అభియోగం ఏమిటంటే.. రాబర్ట్ వాద్రా(Robert Vadra) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన వ్యాపార కార్యకలాపాలు ప్రధానంగా ఢిల్లీ, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. స్కై లైట్ హాస్పిటాలిటీ పేరుతో ఒక కంపెనీని వాద్రా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వద్ద ఉండే భూమి రికార్డుల్లో యజమానుల పేర్లను మార్చే ప్రక్రియను లీగల్ భాషలో ‘ముటేషన్లు’ అంటారు. 2008 సంవత్సరం ఫిబ్రవరిలో హర్యానా రాష్ట్రం పరిధిలోని శిఖోపూర్‌లో రూ.7.50 కోట్లతో ఒక భూమిని వాద్రా కొన్నారు. సాధారణంగా ఎవరైనా భూమిని కొంటే, దాని యజమానుల వివరాలను మార్చేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. అదేనండి.. ముటేషన్లు జరగడానికి కొన్ని నెలల సమయం అవసరం. కానీ రాబర్ట్ వాద్రా హర్యానాలో సదరు భూమిని కొన్న మరుసటి రోజులోగా ముటేషన్లు జరిగిపోయాయని ఈడీ అంటోంది.
Also Read :Split In NDA : ఎన్‌డీఏకు కటీఫ్.. ‘ఇండియా’లోకి ఆ పార్టీ ?
యూపీఏ హయాంలో అలా..
ఆ భూమిలోని 2.71 ఎకరాల్లో హౌసింగ్ సొసైటీని డెవలప్ చేసేందుకు కొన్ని నెలల్లోనే వాద్రాకు హర్యానా టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి పర్మిట్ కూడా వచ్చేసింది. దీంతో వెను వెంటనే సదరు స్థలం ధరకు రెక్కలు వచ్చాయి. తదుపరిగా అదే స్థలాన్ని ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్‌కు రాబర్ట్ వాద్రా ఏకంగా రూ.58 కోట్లకు విక్రయించారు. ఇదంతా జరిగిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఉంది. యూపీఏ సర్కారు అండతోనే ఇదంతా జరిగిందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.