Jio Services Down : రిలయన్స్ జియో సేవలకు స్వల్ప అంతరాయం కలిగింది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం 12.18 గంటల వరకు దాదాపు 10వేల మందికిపైగా యూజర్లు సోషల్ మీడియా వేదికగా జియోకు ఫిర్యాదులు చేశారని డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ తెలిపింది. ప్రత్యేకించి భారత్‌లోని ముంబై ఏరియా నుంచి పెద్దసంఖ్యలో జియోకు కంప్లయింట్స్ వెళ్లాయని వెల్లడించింది. జియో నెట్ వర్క్ లేదని కొందరు.. ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదని ఇంకొందరు.. జియో ఫైబర్ సేవలు అందడం లేదని మరికొందరు.. జియో టీవీ ప్లస్ సేవలు రావడం లేదని పలువురు జియోకు కంప్లయింట్స్ ఇచ్చారని డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా కొందరు యూజర్లు ఈ తరహా సమస్యలను ఎదుర్కొన్నారని నివేదించింది. కంప్లయింట్ చేసిన జియో యూజర్లలో 68 శాతం మంది సిగ్నల్స్ అందడం లేదని చెప్పారు. 18 శాతం మంది మొబైల్ ఇంటర్నెట్ రావడం లేదన్నారు. 14 శాతం మంది జియో ఫైబర్ సర్వీసుల ప్రాబ్లమ్ ఉందని తెలిపారు. అయితే ఈ అంశంపై జియో ఇంకా అధికారిక వివరణ ఏదీ విడుదల చేయలేదు. జియో వివరణ విడుదల చేస్తేనే.. ఈ సమస్యకు గల కారణం ఏమిటి(Jio Services Down) అనేది తెలియనుంది.
Also Read :Satya Nadella : 85 శాతం మంది ఉద్యోగులు అతిగా పని చేస్తున్నారట: సత్య నాదెళ్ల
జియో కంపెనీకి చెందిన ఒక ఇంటర్నెట్ డాటా సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్లే ఈవిధంగా టెలికాం సేవల్లో అంతరాయం కలిగిందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అయితే ఇది సరైన అంశమేనా ? కాదా ? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. జియో నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే అసలు సమస్య ఏమిటనేది తెలుస్తుంది. ఇంకొందరు నెటిజన్లు స్పందిస్తూ.. జియోసేవలు ఇలా అకస్మాత్తుగా ఇబ్బందిపెడతాయని తాము అనుకోలేదని కామెంట్స్ పెట్టారు. చాలా అసౌకర్యానికి గురవుతున్నామని పేర్కొన్నారు. కాగా, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సేవలు యథావిధిగా అందుతున్నాయి.