Site icon HashtagU Telugu

PM Modi : భారతీయులంతా తలుచుకుంటే వికసిత భారత్ సాధ్యమే : ప్రధాని మోడీ

Jan Dhan Accounts

Jan Dhan Accounts

PM Modi : వికసిత్‌ భారత్‌ సాకారమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారతీయులంతా తలచుకుంటే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన చెప్పారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం దేశ ప్రజలను  ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రధాని హోదాలో స్వాతంత్య్ర దినోత్సవ(ఆగస్టు 15) ప్రసంగం చేయడం ఇది 11వ సారి. ‘వికసిత్‌ భారత్‌ 2047’ నినాదం అనేది 140 కోట్ల మంది కలల తీర్మానం అని ప్రధాని పేర్కొన్నారు. దేశ హితమే తమకు ప్రథమ ప్రాధాన్యమని మోడీ స్పష్టం చేశారు. ఇందుకోసం అన్ని రంగాల్లో భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందని ఆయన తేల్చి చెప్పారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎగుమతుల్లో పురోగతితో ప్రపంచ ప్రగతిలో భారత్‌ పాత్ర పెరిగిందన్నారు. భారత్‌ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని మోడీ(PM Modi) తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పు తెచ్చిందని ప్రధాని తెలిపారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో సంస్కరణలను అమలు చేశామని ప్రధాని మోడీ గుర్తు చేశారు. భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందన్నారు. ‘‘దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరం. ప్రభుత్వ ప్రమేయం అతితక్కువగా ఉండేలా పౌరసేవలు అందిస్తున్నాం. న్యాయవ్యవస్థలో కూడా సంస్కరణలు అవసరం. ఆ దిశగా మేం ఇప్పటికే అడుగులు వేశాం. నూతన నేర, న్యాయ చట్టాల్లో శిక్షల కంటే న్యాయానికే ప్రాధాన్యత ఇచ్చాం’’  అని ఆయన వివరించారు.  ‘‘అంతరిక్షంలో భారత స్పేస్‌ స్టేషన్‌ త్వరలో సాకారం అవుతుంది. ఈ రంగంలో వందలకొద్దీ స్టార్టప్‌లు వచ్చాయి. ప్రైవేటు ఉపగ్రహాలు, రాకెట్లు ప్రయోగిస్తున్నారు’’ అని మోడీ తెలిపారు. ‘‘భారతదేశ ప్రస్థానం యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. శతాబ్దాల తరబడి మన దేశం బానిసత్వంలో మగ్గింది. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారు. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లు. వీరందరి కలలను సాకారం చేయాలి. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయి. విపత్తు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రధాని తెలిపారు.

Also Read :Midnight Protest : అట్టుడికిన కోల్‌కతా.. ఆస్పత్రిని ధ్వంసం చేసిన నిరసనకారులు

‘‘దేశంలోని దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలి.  యువత కోసం మేం నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెచ్చాం.  త్వరలోనే కోటిమంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తాం. మరో 10 కోట్లమంది మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారు.స్వయం సహాయక రంగాలకు ఇప్పటివరకు 9 లక్షల కోట్లు రుణాలిచ్చాం’’ అని ప్రధాని మోడీ చెప్పారు.  జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 15 కోట్లమందికి లబ్ధి చేకూరిందన్నారు.