Ratan Tata : రతన్ టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఇవాళ మహారాష్ట్రలో సంతాప దినం

రతన్ టాటా (Ratan Tata) భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ)లో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు.

Published By: HashtagU Telugu Desk
Ratan Tata State Funeral Day Of Mourning Maharashtra

Ratan Tata : విఖ్యాత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. రతన్ టాటాకు గౌరవసూచకంగా గురువారం రోజు మహారాష్ట్రలో సంతాప దినంగా పాటిస్తామని ఆయన వెల్లడించారు. ఇవాళ మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం షిండే తెలిపారు. ఈరోజు జరగాల్సిన వినోద కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు రద్దవుతాయని చెప్పారు. రతన్ టాటా (Ratan Tata) భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ)లో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. అక్కడ ప్రజలు ఆయనకు చివరి నివాళులు అర్పిస్తారు. అదేరోజు సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరుగుతాయి.

Also Read :Tata Group Next Generation: ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.. ర‌త‌న్ టాటా వార‌సులు ఎవ‌రూ..?

‘‘రతన్ టాటా అంటేనే నైతికత, వ్యవస్థాపకతలకు కేరాఫ్ అడ్రస్. ఆయన గొప్ప వ్యక్తి.  భవిష్యత్ తరాలకు టాటా ఒక రోల్ మాడల్. భారతదేశ పారిశ్రామిక వృద్ధికి ఆయనొక చిహ్నం’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.  ‘‘2008 సంవత్సరంలో తాజ్ హోటల్‌పై ముంబై ఉగ్రదాడి జరిగిన తర్వాత రతన్ టాటా చూపించిన దృఢ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన దృఢమైన నిర్ణయాలు, ధైర్యమైన వైఖరి, సామాజిక నిబద్ధత ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. రతన్‌జీ టాటా అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం’’ అని సీఎం షిండే చెప్పారు.

Also Read :Ratan Tata Net Worth: మ‌ర‌ణించే స‌మ‌యానికి రతన్ టాటా సంపాద‌న ఎంతో తెలుసా..?

  • 1991లో టాటా గ్రూప్ పగ్గాలను రతన్ టాటా చేపట్టారు.
  • టాటా గ్రూప్ ఛైర్మన్ అయిన వెంటనే కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి అంతర్జాతీయ కంపెనీలను కొనడంలో కీలకపాత్ర పోషించారు.
  • స్టీల్, ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో టాటా గ్రూపును బలోపేతం చేయడంలో రతన్ టాటాది  ముఖ్య భూమిక.
  • రతన్ టాటా 2012లో ఛైర్మన్ హోదా నుంచి పదవీ విరమణ చేశారు.
  Last Updated: 10 Oct 2024, 09:22 AM IST