Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు-2024 పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టింది. జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పొడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. విపక్షాల నిరసనల మధ్యే ఈ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ఇక, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే జేపీసీ నివేదికను తప్పుపట్టారు. జేపీసీ నివేదికలో ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అభ్యంతరాలను నివేదిక నుంచి తొలగించారని ఆరోపించారు. జేపీసీ నివేదికను తిరిగి వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. ఏకాభిప్రాయం సాధించాకే బిల్లు ఆమోదించాలని కోరారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కేంద్రం పని చేస్తోందని ధ్వజమెత్తారు. నకిలీ నివేదికను ఎప్పటికీ అంగీకరించబోమని ఖర్గే స్పష్టం చేశారు.
కాగా, ముసాయిదా నివేదికను జేపీసీ జనవరి 29న ఆమోదించిన విషయం తెలిసిందే. బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. ఈ సవరణలతో వక్ఫ్‌బోర్డులలో ముస్లిమేతరులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లుపై ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి త్వరితగతిన ఆమోదింపజేసుకుంది.