దేశంలో ప్రైవేట్ బస్సుల్లో జరిగే అగ్నిప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్-ఢిల్లీ రహదారిపై జరిగిన ఘటన ప్రజలను విషాదంలో ముంచింది. రన్నింగ్లోని బస్సు హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో జరిగిన ఈ విపత్తు ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలపై మళ్లీ పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది.
Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!
కేవలం ఈ నెలలోనే జైసల్మేర్లో 26 మంది, కర్నూలులో 19 మంది బస్సుల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో మృతి చెందడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ప్రమాదాల వెనుక సాధారణంగా అజాగ్రత్త, తగిన భద్రతా పరికరాల లేమి, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చాలామంది బస్సు నిర్వాహకులు ఖర్చును తగ్గించుకోవడంలో భద్రతా ప్రమాణాలను పాటించడం మరిచిపోతున్నారు. ప్రయాణికుల ప్రాణ భద్రతకు సంబంధించిన నిబంధనలను అమలు చేయడంలో స్పష్టమైన లోపాలు ఉన్నాయని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి.
ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన పర్యవేక్షణ అవసరం. బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, సురక్షిత విద్యుత్ కనెక్షన్ల వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం కూడా క్రమానుగత తనిఖీలను కఠినంగా అమలు చేయాలి. ప్రతి ప్రమాదం తర్వాత సానుభూతి, పరిహారం ప్రకటనలతో ఆగిపోకుండా వ్యవస్థాత్మక మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే, ప్రతి ప్రమాదం వెనుక ప్రాణాలు కోల్పోయిన వారు కేవలం సంఖ్యలు కాదు, ఓ కుటుంబం కలలు, ఆశలు నశించిపోతున్నాయి.
