Husband Vs Wife : అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌లోని దాంతా రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ సెగ్మెంట్ నుంచి భార్యాభర్తలిద్దరూ ఒకరిపై మరొకరు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ చౌదరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దాదాపు ఖాయమైంది. మరోవైపు వీరేంద్ర సింగ్ భార్య రీటా చౌధరీ ఈ ఏడాది ఆగస్టులోనే జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)లో చేరారు. ఆ పార్టీలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలయ్యారు. ప్రస్తుతం దాంతా రామ్‌గఢ్‌లో తమ అభ్యర్థిగా రీటాను జేజేపీ ప్రకటించింది. భర్తతో పోటీపై రీటా స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్‌లో నా భర్తకు టికెట్ ఇంకా కన్ఫామ్ కాలేదు. కాబట్టి ఇప్పుడే దానిపై నేను మాట్లాడదల్చుకోలేదు’’ అని స్పష్టం చేశారు. దీనిపై రీటా భర్త, ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ స్పందిస్తూ.. ‘‘ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు, నా భార్యకు మధ్య ప్రత్యక్ష పోటీ ఉండొచ్చు’’ అని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. గతంలో రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన నారాయణ్ సింగ్ చౌదరి కుమారుడే వీరేంద్ర సింగ్ చౌదరి. దాంతా రామ్‌గఢ్ నుంచి ఏడుసార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన పొలిటికల్ ట్రాక్ రికార్డు నారాయణ్ సింగ్‌కు ఉంది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత అజయ్ సింగ్ చౌతాలా సొంత పార్టీని ఏర్పాటు చేయకముందు జనతాదళ్‌లో ఉండేవారు. అజయ్ సింగ్ చౌతాలా జనతాదళ్ టికెట్‌పై 1990 అసెంబ్లీ ఎన్నికల్లో దాంతా రామ్‌గఢ్ నుంచి పోటీ చేసి నారాయణ్ సింగ్ చౌదరిని ఓడించారు. నారాయణ్ సింగ్ చౌదరి కుటుంబ రాజకీయ భవితవ్యానికి ఒకప్పుడు ఛాలెంజ్ విసిరిన జేజేపీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ చౌదరి భార్య రీటా చౌదరి ఎన్నికల బరిలోకి దిగుతుండటం గమనార్హం. నియోజకవర్గంలో తమ కుటుంబానికి రాజకీయపరమైన ఎదురుగాలి లేకుండా చూసుకునేందుకే భార్యాభర్తలు ఇలా చేస్తున్నారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.