Make in India : లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం ఉద్దేశం మంచిదేనని, కానీ ఇప్పటిదాకా ఆ పథకంతో ఒరిగిందేమీలేదని వ్యాఖ్యానించారు. మేకిన్ ఇండియా ఆచరణలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ అన్నారు.
2014లో దేశ GDPలో తయారీ రంగం వాటా 15.3% ఉండగా, ప్రస్తుతం ఇది 12.6%కి పడిపోయింది. ఇది గత 60 ఏళ్లలో తయారీ రంగం కనీస స్థాయికి చేరిన పరిస్థితి. నేను ప్రధానమంత్రిని నేరుగా తప్పుపట్టడం లేదు. ఆయన ప్రయత్నించలేదు అని చెప్పడం సరికాదు. కానీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ప్రధానమంత్రి ప్రయత్నించారు… కానీ విఫలమయ్యారు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఏఐలో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుందని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు అకస్మాత్తుగా 70 లక్షల ఓట్లు పెరిగాయని, ఓటర్ల సంఖ్య ఉన్నట్టుండి ఎందుకు పెరుగుతోందో ఈసీ చెప్పాలని అన్నారు.
మేక్ ఇన్ ఇండియా విఫలమైంది కాబట్టే, మన దేశం ఉత్పత్తి చేయడం మానేసింది. అందుకే, చైనా దళాలు మన దేశంలో ఉన్నాయని అన్నారు. ప్రతి దేశం ప్రధానంగా రెండు విషయాలను నిర్వహిస్తుంది .వినియోగాన్ని, ఉత్పత్తిని. వినియోగాన్ని నిర్వహించడాన్ని నేడు సర్వీసుల రంగం అని చెబుతాం. ఉత్పత్తి నిర్వహణ అంటే తయారీ రంగం. అయితే, ఉత్పత్తి అనేది కేవలం తయారీతో మాత్రమే పరిమితం కాదు. మనం, ఒక దేశంగా, ఉత్పత్తిని సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాం అని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Fact Check: స్టార్ క్రికెటర్ సిరాజ్‌కు విగ్రహాలు.. ఫొటోలు వైరల్