Site icon HashtagU Telugu

Bharat Nyay Yatra : జనవరి 14 నుంచి రాహుల్‌గాంధీ ‘భారత్ న్యాయ్ యాత్ర’

Rahul Gandhi

Rahul Gandhi

Bharat Nyay Yatra : ‘భారత్‌ న్యాయ్ యాత్ర’కు రాహుల్‌గాంధీ రెడీ అయ్యారు. ఆయన జనవరి 14 నుంచి మార్చి 20 వరకు.. మణిపూర్ నుంచి ముంబై దాకా  భారత్‌ న్యాయ్ యాత్రను నిర్వహించనున్నారు. భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా 6,200 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది. ఈవిషయాన్ని మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.  ఈసారి యాత్రలో యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలతో రాహుల్ మాట్లాడతారని చెప్పారు. మణిపూర్‌, నాగాలాండ్, అసోం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ మీదుగా యాత్ర జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ యాత్ర చివరకు మహారాష్ట్రలో ముగుస్తుందన్నారు. ఈ సారి కాలినడకన కాకుండా బస్సులో రాహుల్ గాంధీ యాత్ర(Bharat Nyay Yatra) జరుగుతుందని  కేసీ వేణుగోపాల్ వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ మొదలుపెట్టారు.  దాదాపు 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల మేర సాగిన ఆ యాత్ర చివరగా కశ్మీర్‌లో ముగిసింది. దాదాపు 136 రోజుల పాటు రాహుల్ గాంధీ ఆ యాత్ర చేశారు. భారత్ జోడోలో రాహుల్ గాంధీ పూర్తిగా పాదయాత్ర చేశారు. ఈ సారి మాత్రం హైబ్రిడ్ మోడ్‌లో యాత్ర సాగనుంది. అంటే కొంత దూరం వరకూ నడక ద్వారా, కొంతదూరం వాహనాల్లో ఆయన యాత్ర చేస్తారు. రాహుల్ గాంధీ యాత్ర కోసం ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసొచ్చేలా రాహుల్ గాంధీ ‘భారత్‌ న్యాయ్ యాత్ర’ను మలుచుకోవాలనే వ్యూహంతో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలు ఉన్నాయి. హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌లోనే ఇప్పుడు రాహుల్ ‘భారత్‌ న్యాయ్ యాత్ర’ మొదలవుతుండటం గమనార్హం. మణిపూర్‌లో జరిగిన అరాచకాన్ని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంపై రాహుల్ ఆ రాష్ట్రంలో ఫోకస్ చేయనున్నారు.

Also Read: Computer Power Options : కంప్యూటరులో హైబర్నేట్ మోడ్, స్లీప్ మోడ్ మధ్య తేడా తెలుసా ?