NEET Issue : నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై మరోసారి పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాలు గళమెత్తాయి. దానిపై తక్షణం చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. లోక్‌సభలో ఈ అంశాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగా.. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దీనిపై మాట్లాడారు. వెంటనే నీట్ అంశంపై చర్చ జరపాలని, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు. ఈవిషయంపై తాము ఇప్పటికే సభల్లో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చామని వారు గుర్తు చేశారు. అయితే అటు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, ఇటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అందుకు నో చెప్పారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, శూన్య గంట లేవు కాబట్టి వాయిదా తీర్మానాలపై చర్చను నిర్వహించడం కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాత్రమే చర్చ జరుగుతుందని వారు తేల్చి చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత నీట్(NEET Issue) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై చర్చించాలని రాహుల్ గాంధీ కోరగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అందుకు సంబంధించిన నోటీసు ఇస్తే… బిజినెస్ అఫైర్స్ కమిటీ(బీఏసీ)లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చను బీజేపీ ఎంపీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు.
Also Read :France Elections : మాక్రాన్‌కు షాక్.. ఫ్రాన్స్ ఎన్నికల్లో సంచలన ఫలితం
అంతముందు ఇవాళ ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసన తెలిపారు. ‘‘ప్రతిపక్షాన్ని గౌరవించండి.. బెదిరింపులను ఆపండి’’ అంటూ వారు నినాదాలు చేశారు. ‘‘విపక్షాల గొంతు నులిమేందుకు దర్యాప్తు సంస్థలను వాడటం ఆపాలి’’ అని వారు కోరారు. ‘‘ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేయడం ఆపాలి’’ అని విపక్ష ఎంపీలు పేర్కొన్నారు. ఈసందర్బంగా ‘‘భాజపా మే జావో భ్రష్టాచార్ కా లైసెన్స్ పావో’’ (బీజేపీలో చేరండి.. అవినీతికి పాల్పడే లైసెన్సు తెచ్చుకోండి) అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి నేతలను ఉద్దేశపూర్వకంగానే కేంద్ర సర్కారు వేధింపులకు గురిచేస్తోందని.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆప్ ఎంపీలు మండిపడ్డారు.