Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అధికారిక నోటీసులు జారీ చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ దేశ ఎన్నికల వ్యవస్థలో లోపాలు, పారదర్శకత లోపాన్ని ఎత్తిచూపుతూ చేసిన ఆరోపణలతో ఈ పరిణామం సంబంధం ఉంది. ముఖ్యంగా, కర్ణాటకలో ఒకే ఓటరు రెండుసార్లు ఓటు వేసారని చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.
రాహుల్ గాంధీ తన ప్రసంగం, ప్రజెంటేషన్‌లో “శుకున్ రాణి” అనే మహిళ కర్ణాటక ఎన్నికల్లో రెండుసార్లు ఓటు వేసిందని పేర్కొంటూ, పోలింగ్ అధికారుల రికార్డుల ఆధారంగా పత్రాలను చూపించారు. ఈ పత్రాలు ఎన్నికల కమిషన్ రికార్డుల నుంచి సేకరించినవని కూడా స్పష్టం చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, పోలింగ్ స్టేషన్ రిజిస్టర్‌లో టిక్ మార్క్ సూచనలు ఉండటం ద్వంద్వ ఓటును నిర్ధారించిందని చెప్పారు.
ఈ ఆరోపణలపై కర్ణాటక సీఈవో స్పందిస్తూ, తాము చేసిన ప్రాథమిక విచారణలో శుకున్ రాణి అనే మహిళ ఒక్కసారే ఓటు వేశానని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. రాహుల్ గాంధీ చూపించిన టిక్ మార్క్ ఉన్న పత్రాలు పోలింగ్ అధికారి జారీ చేసిన అధికారిక రికార్డులు కావని తేలిందని పేర్కొన్నారు. అందువల్ల, రాహుల్ గాంధీ తన ఆరోపణలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను, పత్రాలను సమర్పించాలని నోటీసులో సూచించారు. వీటి ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు, ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీపై అదే అంశంపై కఠిన వైఖరి చూపింది. ఓట్ల చోరీ ఆరోపణలు నిజమని నిరూపించే డిక్లరేషన్‌ను సమర్పించాలాని, లేదా ఆరోపణలు తప్పయితే దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరింది. తప్పుడు ఆరోపణలు ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
ఈ పరిణామాలతో, రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మళ్లీ వేడెక్కాయి. ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఆయనను సమర్థిస్తుండగా, మరోవైపు బీజేపీ ఆయనపై తప్పుడు ఆరోపణల కేసు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ప్రక్రియపై పారదర్శకత అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
India Developmemt : భారత్ అభివృద్ధిని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారు : రాజ్‌నాథ్ సింగ్