Rahul Gandhi: ఇటీవల కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి విలయం సృష్టించిన విషయం తెలిసిందే. వయనాడ్ కొండచరియల బాధితులకు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక నెల జీతాన్ని ప్రకటించారు. వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) ఈ సాయాన్ని ఆయన అందజేయనున్నారు. వయనాడ్ కొండచరియల బాధితుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు తనవంతు మద్దతుగా ఈ సాయం చేస్తున్నట్టు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒక నెల జీతం రూ. 2.3 లక్షల మొత్తాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. కాగా జులై 30న వయనాడ్‌లో పెను ప్రకృతి విపత్తు జరిగిన విషయం తెలిసిందే. ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాడు. వందలాది మంది చనిపోయారు. వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ బాధితుల్లో 100 మంది ఇళ్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సాయం చేస్తుందని రాహుల్ గాంధీ ఇటీవలే వాగ్దానం చేశారు. ఈ హామీలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ విరాళాలు సమీకరిస్తోందని, రాహుల్ గాంధీ ఇచ్చిన సాయం కూడా ఈ సహాయ నిధులోకి చేరుతుందని కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజూ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, నిధుల సేకరణలో భాగంగా ‘స్టాండ్ విత్ వయనాడ్-ఐఎన్‌సీ’ అనే మొబైల్ యాప్‌ను రూపొందించామని లిజూ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక వయనాడ్‌లో పునరావాస పనులకు సంబంధించిన పురోగతిని కాంగ్రెస్ ఎంపీ కే సుధాకరన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. విరాళాలను అందజేసే కాంగ్రెస్ పార్టీ విభాగాలు, అనుబంధ సంస్థలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్తిస్తామని ఆయన చెప్పారు. మొబైల్ యాప్ ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు, నాయకులు నేరుగా విరాళాలను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చునని పేర్కొన్నారు. విరాళం అందిన వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా దాతకు మెసేజ్ వెళ్తుందని, కేపీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంతకాలతో డిజిటల్ రసీదు వస్తుందని క్లారిటీగా చెప్పారు.
ఇటీవల కేరళలోని వాయనాడ్ జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యింది. మెరుపు వరదలు కొండచరియలు విరిగిపడడానికి కారణమయ్యాయి. ఈ పెను విపత్తులో కొన్ని ఊళ్లు కొట్టుకుపోయాయి. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఇళ్లను కోల్పోయారు. జీవనోపాధికి దూరమయ్యారు. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నీ దెబ్బతిన్నాయి.