Heroic Action : రైళ్లు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తాయనే అపవాదు చాలా కాలంగా ఉంది. ఇదే అభిప్రాయం ఎంతోమంది భారతీయుల మనసుల్లో గూడు కట్టుకొని పోయింది. అయితే ఈ అభిప్రాయాన్ని తారుమారు చేసేందుకు రైల్వేశాఖ హీరోయిక్‌గా పనిచేసింది. స్వయంగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను చొరవచూపి.. ఓ కుటుంబం సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు హెల్ప్ చేశారు. వివరాలివీ..
Also Read : Jake Paul vs Mike Tyson : మైక్ టైసన్‌ను ఓడించిన యూట్యూబర్.. ఇద్దరికీ వందల కోట్లు!
ముంబైకు చెందిన చంద్రశేఖర్ వాఘ్ పెళ్లికి డేట్ ఫిక్సయ్యింది. అసోంలోని గౌహతి సమీపంలో ఉండే సరైఘాట్ పట్టణానికి చెందిన వధువుతో ఆయనకు వివాహం నిశ్చయమైంది. మ్యారేజ్ కోసం చంద్రశేఖర్ వాఘ్ కుటుంబంలోని దాదాపు 35 మంది సభ్యులంతా కలిసి గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి గౌహతికి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో రైల్వే క్రాసింగ్‌ల కారణంగా గీతాంజలి ఎక్స్‌ప్రెస్ దాదాపు 4 గంటలు ఆలస్యంగా నడవసాగింది. దీంతో చంద్రశేఖర్ వాఘ్ ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సంప్రదించారు. తమ పరిస్థితిని ఆయనకు వివరించారు. సకాలంలో తాము హౌరా (పశ్చిమ బెంగాల్)కు చేరుకోలేకపోతే.. హౌరా స్టేషన్ నుంచి సరైఘాట్‌కు వెళ్లే కనెక్టింగ్ ట్రైన్‌ను తాము మిస్ అవుతామని రైల్వేమంత్రికి చంద్రశేఖర్ వాఘ్ వివరించారు. వీలైనంత త్వరగా రైలు కోల్‌కతాకు చేరుకునేలా సాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీనికి రైల్వేమంత్రి సానుకూలంగా బదులిచ్చారు. తప్పకుండా సాయం చేస్తానన్నారు.
Also Read :X Vs Bluesky : లక్షలాది ‘ఎక్స్’ యూజర్లు జంప్.. ‘బ్లూ స్కై’కు క్యూ.. కారణమిదీ
రైల్వేశాఖ మంత్రి నుంచి అందిన ఆదేశాలతో తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ అలర్ట్ అయ్యారు. ఆయన హౌరాలోని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM), సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (Sr DCM)లతో కోఆర్డినేట్ చేసుకుంటూ గీతాంజలి ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ సమయం కంటే ముందే హౌరా రైల్వే స్టేషనుకు చేరేలా ఏర్పాట్లు చేశారు. హౌరా రైల్వే స్టేషనులోని ప్లాట్ ఫామ్ నంబరు 21లో చంద్రశేఖర్ వాఘ్ కుటుంబం దిగింది. అయితే ఆ సమయానికే ప్లాట్ ఫామ్ నంబరు 9లో సరైఘాట్ ఎక్స్‌ప్రెస్ రెడీగా ఉంది. రైల్వే సిబ్బంది చొరవ చూపి.. చంద్రశేఖర్ వాఘ్ కుటుంబానికి చెందిన లగేజీని హుటాహుటిన ప్లాట్ ఫామ్ నంబరు 9కు తరలించారు. తమకు సాయం చేసినందుకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రశేఖర్ వాఘ్(Heroic Action) ఎక్స్ వేదికగా మరో పోస్టు పెట్టారు.