Site icon HashtagU Telugu

IAS Trainee – VIP : ట్రైనీ ఐఏఎస్ వీఐపీ డిమాండ్లు.. రాష్ట్ర సర్కారు యాక్షన్

Ias Trainee Vip Pune

IAS Trainee – VIP : సివిల్ సర్వీసెస్.. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ సర్వీసులు.  వీటికి ఎంపికయ్యే వారే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవుతారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకమైన సెక్రెటరీ హోదాల్లోనూ పనిచేసే గొప్ప అవకాశం వీరికి లభిస్తుంటుంది. ఈ సర్వీసుల్లో ఉన్న ఎంతోమంది వాటికి వన్నె తెచ్చారు. సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచారు. అహంభావానికి తావు లేకుండా అంకితభావంతో దేశానికి సేవలు అందిస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎంతోమంది ఉన్నారు. కానీ మహారాష్ట్రలో అపాయింట్ అయిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి(IAS Trainee – VIP) డాక్టర్ పూజా ఖేద్కర్‌ ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. దీంతో ఆమెపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

We’re now on WhatsApp. Click to Join

డాక్టర్ పూజా ఖేద్కర్‌ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఇప్పటివరకు ఆమె ప్రొబేషనరీ ఐఏఎస్‌గా మహారాష్ట్రలోని పూణేలో సేవలు అందించేవారు. ఈక్రమంలో ఆమె తన ప్రైవేట్ ఆడి కారును వాడేవారు. అయితే ఆ కారుపై వీఐపీ నంబరు ప్లేటుతో పాటు ఎరుపు-నీలం వీఐపీ బెకన్ లైట్‌ను ఏర్పాటు చేయించుకున్నారు.  ఒక ప్రైవేటు కారుపై ఇవన్నీ వాడటం వివాదానికి దారితీసింది. అధికారిక వాహనాలపై మాత్రమే వాటిని వాడాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఐఏఎస్‌ల వాహనాలపై ఎర్రబుగ్గను వాడేందుకు వీలు లేదు. ఈవిషయాలన్నీ తెలిసినా.. డాక్టర్ పూజా ఖేద్కర్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు.

అదనపు కలెక్టర్ లేని టైంలో.. 

జిల్లా అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోరే ఆఫీసులో లేని టైంలో ఆ ఛాంబరులో పూజా ఖేద్కర్‌ కూర్చునేవారు. అక్కడ తన నేమ్ ప్లేటును ఏర్పాటు చేయించుకునేవారు. తన పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను పూజా ఖేద్కర్ ఆదేశించారు.పూజా ఖేద్కర్  తండ్రి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి. ఆయన కూడా తన కుమార్తె డిమాండ్లను నెరవేర్చాలంటూ పూణే జిల్లా అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచారు. కొందరు అధికారులకు వార్నింగ్‌లు ఇచ్చారు. ప్రొబేషనరీ ఐఏఎస్ అయిన తన కుమార్తెకు VIP నంబర్ ప్లేట్ ఉన్న అధికారిక కారు, వసతి, తగినంత సిబ్బందితో అధికారిక ఛాంబర్, ఒక కానిస్టేబుల్ ఇవ్వాలని కోరారు. ఈమేరకు వివరాలతో పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందిన ఫిర్యాదుతో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పూజా ఖేద్కర్‌ను పూణె(Pune) నుంచి వాషిమ్‌ జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆమెను నియమించారు.