Priyanka Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. తన సోదరుడు రాహుల్ ఎప్పటికీ సైన్యాన్ని కించపరచరని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ.. “ఆయన కేవలం మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకంలోని ఒక భాగాన్ని చదువుతున్నారు. ఇందులో సైన్యాన్ని అవమానించే అంశం ఏముంది? నిబంధనల ప్రకారం బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని (పబ్లిక్ సోర్స్) ప్రస్తావించవచ్చు. అది పుస్తకం కావచ్చు లేదా మ్యాగజైన్ కావచ్చు. ఈ పుస్తకంలోని అంశం ఇప్పటికే ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఇది నిరాధారమైన సమాచారం కాదు కదా, మరి సమస్య ఏంటి? దీనికి మోదీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?” అని ప్రశ్నించారు.
‘చైనా ముందు 56 అంగుళాల ఛాతి ఏమైంది?’
మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని విషయాలు బయటకు వస్తే బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల అసలు స్వరూపం దేశానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా సరిహద్దు వివాదం విషయంలో ఆ ’56 అంగుళాల ఛాతి’ ఏమైందో ప్రజలకు అర్థమవుతుందని ఆయన విమర్శించారు. లోక్‌సభలో ఈ గందరగోళం కొనసాగడంతో సభ రెండుసార్లు వాయిదా పడి, చివరకు మంగళవారం ఉదయానికి వాయిదా పడింది.
Also Read: భారతీయ పురుషులు వయసు కంటే ముందే ఎందుకు ముసలివారిలా కనిపిస్తారు?
మోదీ ప్రభుత్వం భయపడుతోంది: రాహుల్ గాంధీ
సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, మొత్తం ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క లైన్‌కు భయపడుతున్నారు. ఆ లైన్‌ను నేను పార్లమెంట్‌లో ఖచ్చితంగా చెబుతాను, నన్ను ఎవరూ ఆపలేరు” అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా.. “ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాన్ని ఎలా నిరాశపరిచారో మాజీ సైనిక దళాధిపతి ప్రకటన బయటపెడుతుంది” అని రాశారు.
సైన్యంపై రాహుల్ ప్రశ్నలు సంధిస్తున్నారు: కిరణ్ రిజిజు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆయన కల్పిత గాథలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, సైన్యంపైనే ప్రశ్నలు సంధిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. “మీరు (రాహుల్ గాంధీ) దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి ఆధారాలు లేని విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడకండి” అని హితవు పలికారు.
