Site icon HashtagU Telugu

Parliament : రాహుల్ కు ప్రధాని మోడీ కౌంటర్

Central Taxes

Central Taxes

రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సమాధానమిచ్చారు. తనకు ప్రజలు పద్నాలుగు సార్లు ధన్యవాద తీర్మానంపై సమాధానం చెప్పే అవకాశం ఇచ్చారని, ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ అభివృద్ధి దిశగా నడిపే సంకల్పాన్ని తెలియజేసిందని, రాబోయే 25 ఏళ్లలో “వికసిత భారత్” లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు.

ప్రభుత్వం తప్పుడు హామీలకు తావు ఇవ్వదని, పేదల అభివృద్ధికి నిజమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 లక్షల గృహాలను పేదలకు అందించామని, మహిళల బహిర్భూమి సమస్యను పరిష్కరించేందుకు 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని వివరించారు. గత ఐదు దశాబ్దాలుగా 25 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేలా చేయగలిగామని, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తేనే నిజమైన మార్పు సాధ్యమని అన్నారు.

Nagpur Pitch Report: తొలి వన్డేకు వర్షం ముప్పు? నాగ్‌పూర్ వెద‌ర్ అప్డేట్ ఇదే!

ఇదే సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పేదల సమస్యలను అర్థం చేసుకోని వారు అలాంటి ప్రసంగాలను ఆసక్తిగా అనుభవించలేరని చెప్పారు. కేజ్రీవాల్‌పై ప్రస్తావిస్తూ.. కొంతమంది నాయకులు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి తాగునీరు అందించడంపై దృష్టిసారిస్తుందని అన్నారు.

గతంలో ఒక ప్రధాని ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామాలకు కేవలం 16 పైసలే చేరేవని వాపోయారని, కానీ ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల నేరుగా ప్రజల ఖాతాల్లో నిధులు చేరుతున్నాయని మోదీ వివరించారు. నగదు బదిలీ ద్వారా మిడిల్‌మెన్ వ్యవస్థను పూర్తిగా తొలగించామని, పారదర్శకతను పెంచామని తెలిపారు. మొత్తానికి, రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేస్తూనే, తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.