Site icon HashtagU Telugu

President Murmu : రాష్ట్రపతి, గవర్నర్లకు ‘సుప్రీం’ డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ? ముర్ము 14 ప్రశ్నలు

President Droupadi Murmu Supreme Court Judicial Overreach Governors Powers State Legislation

President Murmu : తమిళనాడు గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి స్పందించే విషయంలో నిర్దిష్ట గడువు అనేది ఉండాలని ఆ తీర్పులో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద విశేషాధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు పరిశీలన కోసం భారత రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము 14 రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలన్నీ దేశంలోని రాష్ట్రాల చట్టాలపై గవర్నర్లు, రాష్ట్రపతికి ఉండే అధికారాల పరిధికి సంబంధించినవే. వీటిపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టును రాష్ట్రపతి కోరారు.

Also Read :Radiation Leak : భారత్ దాడితో పాక్‌లో రేడియేషన్ లీక్.. అమెరికా, ఈజిప్ట్ ఏం చేశాయంటే..

సుప్రీంకోర్టు పరిశీలనకు రాష్ట్రపతి  14 ప్రశ్నలివీ..

1. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లును స్వీకరించిన తర్వాత గవర్నర్‌కు ఆర్టికల్ 200 కింద అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన ఆప్షన్లు ఏమిటి?

2. రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులతో వ్యవహరించేటప్పుడు గవర్నర్..  మంత్రి మండలి సహాయం, సలహాల మేరకే వ్యవహరించాలా?

3. ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణ న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుందా?

4. ఆర్టికల్ 200 కింద గవర్నర్ నిర్ణయాలను కోర్టు సమీక్ష నుంచి ఆర్టికల్ 361 పూర్తిగా కాపాడుతుందా?

5. రాజ్యాంగంలో స్పష్టమైన కాలపరిమితి అనేదే లేనప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులపై చర్య తీసుకోవడానికి గవర్నర్లకు న్యాయవ్యవస్థ టైం లిమిట్స్ విధించొచ్చా?

6. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి(President Murmu) విచక్షణాధికారాన్ని న్యాయపరంగా సమీక్షించొచ్చా ?

7. రాజ్యాంగబద్ధమైన ఆదేశాలు లేనప్పుడు.. రాష్ట్రపతి న్యాయపరంగా సూచించిన కాలక్రమాలకు కట్టుబడి ఉంటారా?

8. గవర్నర్ బిల్లును రిజర్వ్ చేసినప్పుడు.. రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా?

9. బిల్లు చట్టంగా మారే ముందు.. గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా?

10. రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయాలను భర్తీ చేయడానికి లేదా ప్రత్యామ్నాయం చేయడానికి ఆర్టికల్ 142 కింద అనుమతి ఉందా?

11. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టంగా మారుతుందా?

12. రాష్ట్రాల బిల్లులకు సంబంధించిన  రాజ్యాంగ వివరణ ప్రశ్నలను ముందుగా ఆర్టికల్ 145(3) కింద రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలా?

13. ఆర్టికల్ 142 అనేది విధానపరమైన అంశాలను దాటేసి..  చట్టాలు లేదా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తీర్పులను ఇచ్చేందుకు అనుమతిస్తుందా?

14. ఆర్టికల్ 131  అనేది ప్రత్యేక సుప్రీంకోర్టు అధికార పరిధిని అందిస్తుంది.  కేంద్ర- రాష్ట్రాల వివాదాలను ఆర్టికల్ 131 వెలుపల పరిష్కరించొచ్చా?