బీహార్‌లో ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor) స్థాపించిన ‘జన్ సురాజ్’ (Jan Suraj) పార్టీకి అధికారికంగా ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ పార్టీకి ‘స్కూల్ బ్యాగ్’ (School Bag) గుర్తుగా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ గుర్తుతో పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ గుర్తు సామాజిక అభివృద్ధిని సూచిస్తుందన్న అభిప్రాయాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు.
June 25 : సరిగ్గా ఇదే రోజు ఏపీలో విధ్వంసకర వైఖరికి బీజం పడింది – చంద్రబాబు
ప్రశాంత్ కిషోర్ 2024 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్’ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. పార్టీ ప్రారంభానికి ముందు ఆయన రెండు సంవత్సరాలపాటు చంపరాన్ నుంచి 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని ప్రజల్లో మద్దతు కూడగట్టుకున్నారు. ఇటీవలే ఆయన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు. పాత రాజకీయాలను మార్చి సమ్మిళితాభివృద్ధికి ‘జన్ సురాజ్’ వేదిక అవుతుందని కిషోర్ ప్రకటించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 అక్టోబర్-నవంబర్‌లో జరగనున్నాయి. గత ఎన్నికల తరువాత చోటుచేసుకున్న పొలిటికల్ షఫిలింగ్ నేపథ్యంలో ‘జన్ సురాజ్’ కీలక పార్టీగా ఎదగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్డీయే, మహాఘట్‌బంధన్‌ల మధ్య పొత్తులు, విడిపోయే గలాటాలతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’ ఓ తాజా రాజకీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పేదల అభ్యున్నతే తమ లక్ష్యమంటూ, జన్ సురాజ్ రాష్ట్ర రాజకీయాల్లో విశేష ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది.