Site icon HashtagU Telugu

Prashant Kishor : తేజస్వి పెద్ద నేత.. ఆయనొస్తే నేను తప్పుకుంటా.. పీకే కీలక వ్యాఖ్యలు

Prashant Kishor Tejashwi Yadav Bihar Bpsc Aspirants Protest

Prashant Kishor : జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) పార్టీ అగ్రనేత , బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్‌‌ను కొనియాడారు. తేజస్విని అతిపెద్ద నాయకుడిగా ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌‌సీ) పరీక్షకు వ్యతిరేకంగా బిహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న అభ్యర్థుల నిరసనలకు సారథ్యం వహించాలని తేజస్విని ఆయన కోరారు.  ఆదివారం రోజు ఈ  నిరసన కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా విలేకరులతో  మాట్లాడారు.  ‘‘అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ చొరవ చూపి బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యతిరేక నిరసనలపై మాట్లాడాలి. ప్రత్యక్ష నిరసనల్లోనూ పాల్గొనాలి’’ అని పీకే కోరారు. ‘‘తేజస్వి రంగంలోకి దిగుతారంటే.. పక్కకు తప్పుకునేందుకు మా జన్ సురాజ్ పార్టీ సిద్ధంగా ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘మాకు విద్యార్థుల సమస్య మాత్రమే ఎజెండా. దీనిపై రాజకీయాలు చేయదల్చుకోలేదు. ఆర్‌జేడీ పార్టీ శ్రేణులతో తేజస్వి  రంగంలోకి దిగుతారంటే స్వాగతం పలుకుతాం’’ అని పీకే తేల్చి చెప్పారు.  ‘‘నా ఆమరణ నిరాహార దీక్ష గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. నేను అంత త్వరగా జబ్బు పడను. ఇప్పటికీ బాగానే ఉన్నాను. నా గొంతు కాస్త గరగరగా ఉంది. డాక్టర్లు నన్ను పడుకోమన్నారు. ఏమీ సీరియస్ పరిస్థితి లేదు’’ అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.

Also Read :Maoists Encounter : అబూజ్‌మడ్‌లో మరో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం

తేజస్వి ఏమంటున్నారు ?

ఇటీవలే ప్రముఖ వార్తాసంస్థతో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. బీపీఎస్‌సీ పరీక్షకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలపై స్పందించారు. ఆ నిరసనల్లో పాల్గొంటున్న పలువురిని బీజేపీకి చెందిన బీ టీమ్‌గా అభివర్ణించారు. యువత, విద్యార్థులు స్వతంత్రంగా నిర్వహిస్తున్న నిరసన ఉద్యమాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని తేజస్వి ధ్వజమెత్తారు. బీజేపీకి బీ టీమ్‌గా మారిన వాళ్లను గుర్తించాలని బిహార్ ప్రజలకు తేజస్వి పిలుపునిచ్చారు. “యువత, విద్యార్థుల నిరసన ఉద్యమాన్ని అంతం చేసే కుట్ర రెడీ అయింది.నటీనటులను ఆ వ్యానిటీ వ్యాన్‌లో కూర్చోబెడుతున్నారు. దర్శకుడు, నిర్మాత ఎవరు అనేది ప్రజలు గుర్తించాలి.  నటుడిని ఆ వ్యాన్‌లో ఎందుకు కూర్చోబెట్టారో మాకు తెలుసు. అందరికీ తెలుసు’’ అని తేజస్వి కీలక కామెంట్స్ చేశారు. ఈ తరుణంలో తాజాగా ప్రశాంత్ కిశోర్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

Also Read :OYO New Rule : ఓయో హోటల్స్ షాకింగ్ నిర్ణయం.. వాళ్లకు నో బుకింగ్స్

ఏమిటీ నిరసనలు ?

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) డిసెంబరు 13వ తేదీన ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ (ప్రిలిమినరీ) ఉద్యోగ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ టెస్టును నిర్వహించింది.  అయితే ఆ ఎగ్జామ్‌లో ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందనే ప్రచారం జరిగింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ అభ్యర్థులు పాట్నా నగరం వేదికగా గత కొన్ని వారాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.