Voting Machines: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కోసం సన్నాహాలు మొదలయ్యాయి. అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం (Voting Machines) కూడా ఒక పెద్ద మార్పు తీసుకురానుంది. అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఈవీఎంలలో అభ్యర్థుల రంగుల ఫొటోలు కూడా కనిపిస్తాయి. దీనితో పాటు ఎన్నికల సంఘం ఈవీఎం బ్యాలెట్ పేపర్లను మరింత స్పష్టంగా చదివేందుకు వీలుగా మార్గదర్శకాలను సవరించింది. ఈ మార్పు బిహార్ ఎన్నికల నుంచే మొదలుకానుంది. ఈవీఎంలలో మొదటిసారిగా అభ్యర్థుల రంగుల ఫొటోలు ఉంటాయి. దీంతో పాటు సీరియల్ నంబర్‌ను కూడా మరింత స్పష్టంగా చూపిస్తారు.
నచ్చిన అభ్యర్థిని గుర్తించడం సులభం
ఎన్నికల సంఘం ప్రకారం.. ఒకే పేరున్న అభ్యర్థులు ఉన్నప్పుడు ఓటర్లకు తరచుగా గందరగోళం ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడు ఈవీఎంపై అభ్యర్థి రంగుల ఫొటో కూడా ఉంటుంది. తద్వారా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని సరిగ్గా గుర్తించి ఓటు వేయగలుగుతారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను వచ్చే నెల (అక్టోబర్)లో ఎప్పుడైనా ప్రకటించవచ్చు.
Also Read: Period Cramps Relief: పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గాలంటే?
ఫాంట్ సైజ్- పేపర్‌లో కూడా మార్పు
ఎన్నికల సంఘం ప్రకారం.. ఈవీఎం బ్యాలెట్ పేపర్ బరువును కూడా నిర్ణయించారు. ఇప్పుడు ఈ పేపర్లు 70 జీఎస్‌ఎం బరువుతో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగు పేపర్‌ను ఉపయోగిస్తారు. దీంతో పాటు అభ్యర్థులు, నోటా (NOTA) క్రమ సంఖ్యను కూడా ఈవీఎంపై మందంగా ఉండే ఫాంట్‌లో ముద్రిస్తారు. ఈ ఫాంట్ సైజ్ 30గా ఉంటుంది. అలాగ ఓటర్లు సులభంగా చదవడానికి వీలుగా అన్ని అభ్యర్థుల పేర్లు, నోటాను ఒకే ఫాంట్.. ఫాంట్ సైజ్‌లో ముద్రిస్తారు.