PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నాలుగు రోజుల విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీలలో బ్రిటన్‌ను సందర్శిస్తారు. అనంతరం జూలై 25-26 తేదీలలో మాల్దీవులకు వెళతారు. బ్రిటన్ పర్యటన సందర్భంగా గత మే నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) అంతిమ రూపు ఇచ్చి, దానిపై అధికారికంగా సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారత్, బ్రిటన్ ఆర్థిక సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు.
ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ నిలవడంతో ఈ వాణిజ్య ఒప్పందం అత్యంత కీలకమైనదిగా పరిగణించబడుతోంది. జనవరి 2022లో ప్రారంభమైన ఈ ఒప్పందంపై చర్చలు, మూడు సంవత్సరాలలో 14 రౌండ్ల సంప్రదింపులు పూర్తి చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరగనుంది. భారతదేశం నుండి టెక్స్‌టైల్స్, లెదర్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. అదేవిధంగా బ్రిటన్ నుండి విస్కీ, ఆటోమొబైల్స్, మెడికల్ డివైస్‌ల వంటి ఉత్పత్తులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: Nitish Kumar Reddy: ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరు?
భారతదేశానికి లభించే ప్రయోజనాలు
ఆర్థిక సంవత్సరం 2024లో భారతదేశం నుండి 12.9 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.12 లక్షల కోట్లు) విలువైన వస్తువులు యూకేకి ఎగుమతి అయ్యాయి. వీటిలో లెదర్, ఫుట్‌వేర్, జెమ్స్ & జ్యువెలరీ, టెక్స్‌టైల్స్ & క్లోతింగ్, ఫర్నిచర్, స్పోర్ట్స్ గూడ్స్, కెమికల్స్, ట్రాన్స్‌పోర్ట్/ఆటో కాంపోనెంట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో భారతదేశ ఉత్పత్తులపై 4-16 శాతం వరకు డ్యూటీ ఫీజు విధించబడుతోంది. ఈ ఒప్పందం ద్వారా టారిఫ్‌లు తగ్గితే భారతదేశానికి మరింత ప్రయోజనం లభిస్తుంది.
ఇరు దేశాలకు సమృద్ధిగా ప్రయోజనం
ఈ ఒప్పందం రెండు దేశాలకు పరస్పర ప్రయోజనాలను అందించనుంది.
బ్రిటన్ విస్కీ & జిన్: ప్రస్తుతం 150 శాతం ఉన్న స్కాచ్ విస్కీ మరియు జిన్ దిగుమతి సుంకం మొదట్లో 75 శాతానికి తగ్గించబడి, 10వ సంవత్సరం నాటికి 40 శాతానికి చేరుకుంటుంది.
బ్రిటన్ ఆటోమొబైల్స్: రెండు పక్షాల కోటా కింద బ్రిటన్ ఆటోమొబైల్స్‌పై టారిఫ్ 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించబడుతుంది. ఇది టాటా-జెఎల్‌ఆర్ వంటి కంపెనీలకు గణనీయమైన లాభాన్ని చేకూర్చుతుంది.
వ్యాపార వృద్ధి: ఈ ఒప్పందం వల్ల భారతదేశం యొక్క బ్రిటన్ ఎగుమతులు సుమారు 60 శాతం (15.7 బిలియన్ పౌండ్లు- ₹1.81 లక్షల కోట్లు) పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా, బ్రిటన్ యొక్క భారతదేశ ఎగుమతులు 25 శాతం (9.8 బిలియన్ పౌండ్లు- ₹1.13 లక్షల కోట్లు) పెరిగే సంభావ్యత ఉంది.
‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోత్సాహం: ‘మేక్ ఇన్ ఇండియా’ విధానం కింద బ్రిటన్ కంపెనీలకు ప్రత్యేక సౌలభ్యాలు లభిస్తాయి, ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
లగ్జరీ కార్లు: ఇంటర్నల్ కంబస్చన్ ఇంజిన్ (ICE) వాహనాలపై టారిఫ్ దీర్ఘకాలంలో క్రమంగా తగ్గించబడుతుంది. లగ్జరీ కార్లపై టారిఫ్ కూడా రెండు పక్షాల కోటా కింద 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించబడుతుంది.