Supreme Court – 75 : 75వ వసంతంలోకి సుప్రీంకోర్టు.. చారిత్రక విశేషాలివీ

Supreme Court - 75 : 1950 జనవరి 28న ఏర్పాటైన భారత సుప్రీంకోర్టు..  ఈరోజు 75వ వసంతంలోకి అడుగు పెట్టింది.

  • Written By:
  • Updated On - January 28, 2024 / 09:07 AM IST

Supreme Court – 75 : 1950 జనవరి 28న ఏర్పాటైన భారత సుప్రీంకోర్టు..  ఈరోజు 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈసందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టులో తొలిసారిగా 1950 జనవరి 28న ఉదయం 9.45 గంటలకు న్యాయమూర్తులు తొలిసారిగా సమావేశమయ్యారు. దీంతో ఈ తేదీనే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభోత్సవ సమయంగా పరిగణిస్తారు.  ప్రస్తుతం సుప్రీంకోర్టు నడుస్తున్న భవనం అందుబాటులోకి వచ్చేంతవరకూ.. పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌లోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం కొనసాగింది. ప్రస్తుతం ఢిల్లీలోని తిలక్‌మార్గ్‌లో ఉన్న సుప్రీంకోర్టు భవనం 17 ఎకరాల త్రికోణాకార స్థలంలో నిర్మితమైంది. 1954 అక్టోబరు 29న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరో నాలుగేళ్లకు 1958 ఆగస్టు 4న ఆయనే దీన్ని ప్రారంభించారు. సుప్రీంకోర్టు(Supreme Court – 75) చిహ్నంగా సారనాథ్‌లోని అశోకుడి స్తూపం నుంచి ధర్మచక్రాన్ని స్వీకరించారు. ఈ చిహ్నం కింద న్యాయం ఎక్కడుంటే విజయం అక్కడే అని సూచిస్తూ ‘యతో ధర్మస్తతో జయః’ అనే సంస్కృత సూక్తి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏడాది ఎన్ని రోజులు ?

సుప్రీంకోర్టు ఏర్పాటైన కొత్తలో ఏడాదికి 28 రోజులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే సమావేశమయ్యేది.  ఆ తర్వాత క్రమంగా పనిరోజులను పెంచుకుంటూ సుప్రీంకోర్టు ఏడాదికి 190 రోజులు పనిచేసే స్థాయికి చేరుకుంది.

న్యాయమూర్తుల సంఖ్య 

తొలినాళ్లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 8 (7+1) ఉండగా.. అది ఇప్పుడు 34కు చేరింది. 75 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటివరకు 49 మంది ప్రధాన న్యాయమూర్తులు, 191 మంది న్యాయమూర్తులు సేవలందించారు.

సీజేఐలుగా ఇద్దరు తెలుగుతేజాలు

  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఇద్దరు తెలుగు ప్రముఖులు అయ్యారు. 12 మంది తెలుగువారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయ్యారు. జస్టిస్‌ కోకా సుబ్బారావు 1958 జనవరి 31 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు.  ఆయన 1966 జూన్‌ 30 నుంచి 9వ ప్రధాన న్యాయమూర్తిగా 9 నెలల పాటు సేవలందించారు. ఈయన తన పదవీ కాలానికి నాలుగు నెలల ముందే రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు.
  • ఆ తర్వాత 54 ఏళ్లకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్‌ 24న బాధ్యతలు చేపట్టి 16 నెలలు ఆ పదవిలో కొనసాగారు.
  • న్యాయమూర్తులుగా తెలుగువారైన జస్టిస్‌ పి.సత్యనారాయణరాజు, జస్టిస్‌ పి.జగన్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఒ.చిన్నపరెడ్డి, జస్టిస్‌ కె.రామస్వామి, జస్టిస్‌ కె.జయచంద్రారెడ్డి, జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.జగన్నాథరావు, జస్టిస్‌ పి.వెంకటరామరెడ్డి, జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు పదవీ విరమణ చేశారు.
  • ప్రస్తుతం సేవలందిస్తున్న 34 మంది న్యాయమూర్తుల్లో తెలుగువారు జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్టి ఉన్నారు. సీనియారిటీ ప్రకారం ఇందులో జస్టిస్‌ శ్రీనరసింహ 2027 అక్టోబరు 30న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

తొలి మహిళా న్యాయమూర్తి

సుప్రీంకోర్టు ప్రారంభమైన 39 ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తిని చూసింది. 77 ఏళ్లకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని చూడనుంది. కేరళకు చెందిన ఫాతిమా బీవీ 1989 అక్టోబరు 6న బాధ్యతలు చేపట్టి సర్వోన్నత న్యాయస్థానం తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ బీవీ నాగరత్న 2027 సెప్టెంబరు 24న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు.

Also Read :Nitish Kumar: కాసేపట్లో సీఎం నితీశ్ రాజీనామా.. సాయంత్రం మరోసారి సీఎంగా ప్రమాణం !