78th Independence Day : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2047నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, అందుకు కార్యాచరణను ప్రధాని వివరించనున్నారు. ఇవాళ ప్రధానమంత్రి ఏదైనా కొత్త పథకం ప్రకటిస్తారా లేదా ప్రస్తుతం ఉన్న సంక్షేమ కార్యక్రమాల పరిధిని విస్తరిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రధాని తన ప్రసంగంలో జమ్మూ కాశ్మీర్‌పై మాట్లాడే అవకాశం ఉంది. 2019లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత, ఇప్పుడు కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి, ఈ అంశం కూడా ప్రధానమంత్రి ప్రసంగంలో భాగం కావచ్చు.
Also Read :Shravana Putrada Ekadashi: శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి..?
ఆగస్టు 15 సందర్భంగా(78th Independence Day) ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు పతాకావిష్కరణ చేసిన తొలి కాంగ్రెసేతర పార్టీల ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఎర్రకోట నుంచి జెండా ఎగరేయడం విషయంలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. ఇందిరా గాంధీ తర్వాత ప్రధాని మోడీ రెండో స్థానానికి చేరుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై నుంచి 10 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
We’re now on WhatsApp. Click to Join
అంతకుముందు ప్రధాని మోడీకి ఎర్రకోట వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలోని నేతల బృందం స్వాగతం పలకనుంది. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరిస్తారు. ఆ వెంటనే ప్రధాని మన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ సమయంలో హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపిస్తారు. ఈ వేడుకలకు 6 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరవుతుండగా.. వారిలో రైతులు, యువత, మహిళలు సహా వివిధ రంగాల వ్యక్తులు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది అథ్లెట్లు, క్రీడాకారులు కూడా హాజరవుతారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఎర్రకోట చుట్టూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఎర్రకోట చుట్టూ ఉన్న అన్ని రహదారులను ఇవాళ ఉదయం 4 గంటల నుంచే మూసివేశారు. వాటిని తిరిగి ఉదయం 10 గంటలకు తెరుస్తారు.ఇవాళ ఉదయం 4 గంటలకు ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 13న ఢిల్లీ మెట్రో రైడర్‌షిప్ రికార్డు సృష్టించింది. మంగళవారం 72.38 లక్షల మంది ప్రయాణించారు. ఇది ఒక రోజులో ప్రయాణికుల సంఖ్య రికార్డు.