PM Modi : ఎన్నికల ప్రచారం వేళ వివాదాస్పదంగా మారిన తన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివరణ ఇచ్చారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించి, రాజకీయ ప్రయోజనం పొందేందుకు యత్నించాయని మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join
అది ముస్లింలే అని ఎవరు చెప్పారు ?
‘‘దేశంలోని పేదలు అనుభవిస్తున్న అవస్థల గురించే నేను ఎన్నికల ప్రసంగాల్లో ప్రస్తావించాను. అవి ముస్లిం వర్గాన్ని ఉద్దేశించినవి కావు. ‘ఎక్కువమంది పిల్లలున్న వారు’ అంటే అది ముస్లింలే అని ఎవరు చెప్పారు..? పేద కుటుంబాల్లోనూ అలాంటి పరిస్థితే ఉంది. కొన్ని కుటుంబాల్లో వారి సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా అధిక సంతానం ఉంది. ఏ వర్గం అనేది నేను నా ప్రసంగంలో చెప్పలేదు. ఎవరికైనా సరే స్థోమతకు తగిన స్థాయిలో సంతానం ఉండాలని చెప్పాను ’’ అని ప్రధాని మోడీ(PM Modi) చెప్పారు.
Also Read : Tadipatri : తాడిపత్రిలో 144 సెక్షన్.. రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు
‘‘నా చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవి. మా ఇంట్లో మిగతా పండుగలతో పాటు రంజాన్ ఈద్‌ను కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్లం. ఈద్ రోజున మా ఇంట్లో వంట చేసుకునేవాళ్లం కాదు. ముస్లిం సోదరుల ఇళ్ల నుంచే అన్నం, వంటకాలు వచ్చేవి. మొహర్రం పండుగలో కూడా ఇలాగే మేం భాగమయ్యేవాళ్లం. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు’’ అని ప్రధాని మోడీ వెల్లడించారు. ‘‘హిందూ-ముస్లిం అనే తేడా చూపడం ప్రారంభించిన రోజున ప్రజాజీవితంలో ఉండే అర్హత నాకు ఉండదు. అలాంటి తేడా ఎన్నటికీ చూపను’’ అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. 2002లో గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ముస్లిం వర్గంలో తన ప్రతిష్ఠను దెబ్బతీశారని మోడీ పేర్కొన్నారు.