Site icon HashtagU Telugu

Manipur Crisis : ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.200.. ఏటీఎంలలో డబ్బుల్లేవ్

Manipur Crisis

Manipur Crisis

Manipur Crisis : లీటర్  పెట్రోల్ రూ.200..

పెట్రోల్ కోసం పెద్దపెద్ద క్యూలలో గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి.. 

చాలారకాల వ్యాధులకు మందులు దొరకడం లేదు.. 

ఎన్నో ఏటీఎంలలో డబ్బులు లేవు..  

నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోయాయి..

ఈ పరిస్థితి ఏదో ఆఫ్రికా దేశంలో లేదు..మన దేశంలోని మణిపూర్ లోనే ప్రస్తుతం ఉంది. 

మెయిటీ,  కుకీ వర్గాల మధ్య జరిగిన హింసాకాండతో ఏ వర్గానికి ఏ ప్రయోజనం దొరికిందనే సంగతి అలా ఉంచితే.. సామాన్య ప్రజల జీవితాలు మాత్రం మరింత కష్టాల్లో(Manipur Crisis) కూరుకుపోయాయి.  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. చాలా ఏటీఎంలలో క్యాష్ లేదు. బ్లాక్ మార్కెట్‌లో క్యూ కట్టి మరీ  లీటరు పెట్రోల్  రూ. 200కు కొనాల్సి వస్తోంది. రోగుల ప్రాణాలను రక్షించే ముఖ్యమైన మందుల కొరత ఉంది. దుకాణాలు ప్రతిరోజూ కొన్ని గంటలే తెరుస్తుండటంతో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి.  కిలో బియ్యం ధర రూ.30 నుంచి రూ.60కి పెరిగింది.  కూరగాయల ధరలపైనా ప్రభావం పడింది. గతంలో కిలో రూ.35 ఉన్న ఉల్లిపాయలు ఇప్పుడు రూ.70, బంగాళదుంపల ధర రూ.15 నుంచి రూ.40కి పెరిగింది. కోడిగుడ్డు రూ.6 నుంచి రూ.10కి పెరిగింది. రిఫైన్డ్ ఆయిల్ ధర  మునుపు రూ. 220 ఉండగా.. ఇప్పుడు రూ. 280కి చేరింది.  ఇక సహాయక శిబిరాల్లో తలదాచుకున్న మెయిటీ, కుకీ వర్గాల సభ్యులకు సరిపడా ఆహారం అందడం లేదు.

Also read : Manipur Violence: మణిపూర్‌ హింసపై న్యాయ కమిషన్ ఏర్పాటు

ప్రస్తుత గొడవల నేపథ్యంలో..  వర్షాలతో జనం  రోగాల బారిన పడుతున్నప్పటికీ ప్రభుత్వ ఆరోగ్య శిబిరాల నిర్వహణ జరగడం లేదు.  శిశువులకు టీకాలు వేసే కార్యక్రమాలు జరుగుతున్న దాఖలాలు కూడా లేవు. ప్రతిరోజూ కొన్ని గంటలపాటు మాత్రమే కర్ఫ్యూ సడలిస్తుండటంతో ప్రజల సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. ఇక హింసతో ప్రభావితమైన చాలా ప్రాంతాల్లో నేటికీ ఇంటర్నెట్ లేదు. బ్యాంకింగ్ సేవలు లేవు.  దీంతో అటు బ్యాంకులు తెరుచుకోక.. ఇటు ఏటీఎంలలోనూ డబ్బులు లేక.. కనీసం ఆన్ లైన్ పేమెంట్ చేయలేక జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన కేంద్ర  హోంమంత్రి అమిత్ షా గ్యాస్ సిలిండర్లు , పెట్రోల్, కూరగాయలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇక మణిపూర్ జనజీవనం మునుపటిలాగా ఎప్పటికల్లా గాడిలో పడుతుందో వేచి చూడాలి.