Naxal Free Village: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లా బడేసట్టి గ్రామం ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట. ఇప్పుడా గ్రామం మావోయిస్టుల రహితంగా తయారైంది. ఈవిషయాన్ని తెలుపుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిరణ్ సింగ్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రణాళికలు, భద్రతా దళాల కసరత్తు వల్లే బడేసట్టి గ్రామం పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 11 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారని వెల్లడించారు. వారంతా జనజీవన స్రవంతిలోకి ప్రవేశించారన్నారు. ఈ ఊరు ఇప్పుడు మావోయిస్టుల రహితంగా మారిందన్నారు. 2026 మార్చి 31 నాటికి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు.
Also Read :Aryabhata 50 Years : భారత్ తొలి ఉపగ్రహం ఆర్యభట్టకు 50 ఏళ్లు.. చారిత్రక విశేషాలివీ
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు : కిరణ్ సింగ్‌దేవ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ చీఫ్
‘‘ఛత్తీస్‌గఢ్(Naxal Free Village) ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కృషి వల్లే బడేసట్టి గ్రామం మావోయిస్టు రహితంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పం, విజ్ఞప్తుల ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఎంతోమంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చి చేరారు. వారంతా ఇక రాజ్యాంగ పరిధిలో ఉంటూ సమాజ నిర్మాణానికి దోహదపడాలి. బస్తర్ ప్రాంతంలో ఇక ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది’’ అని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిరణ్ సింగ్‌దేవ్ చెప్పారు.
Also Read :Suriya Emotional: తండ్రి మాటలకు సూర్య ఎమోషనల్.. రియాక్షన్ ఇదీ
బడేసట్టి గ్రామానికి రూ.కోటి ఇస్తాం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర హోం మంత్రి
బడేసట్టి గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి ఇస్తామని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర హోం మంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. మావోయిస్టు రహితంగా మారే అన్ని పంచాయతీలకూ ఈతరహాలో రూ.కోటి ఇచ్చేందుకు సిద్ధమన్నారు. నియ్యాద్ నెల్నార్ పథకం కింద రాష్ట్రంలోని 40 గ్రామ పంచాయతీలను మావోయిస్టురహిత పల్లెలుగా వర్గీకరించామన్నారు. అంతకుముందు, ఏప్రిల్ 8న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆరుగురు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మావోయిస్టులపై మొత్తం రూ.26 లక్షల రివార్డును ప్రకటించారు.