Electronic Warfare : పాకిస్తాన్ వాయుసేనకు చుక్కలు చూపించేందుకు భారత్ రెడీ అయింది. ఈక్రమంలోనే అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది. భారత్ వద్ద ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు దాదాపు 50 దాకా ఉన్నాయి. దీంతోపాటు భారత వాయుసేనకు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా (SPECTRA) సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నేవిగేషన్ సిగ్నల్స్‌ను జామ్ చేయగలవు. ఇంతకీ వీటివల్ల పాకిస్తాన్ వాయుసేనకు ఏమవుతుందో ఈ వార్తలో చూద్దాం..
Also Read :Pakistan Vs India : పాక్ చెరలోనే బీఎస్‌ఎఫ్ జవాన్.. చర్చలపై కొత్త అప్‌డేట్
పాక్ వాయుసేనకు కన్ఫ్యూజన్ తప్పదు
పాకిస్తాన్ వాయుసేన వినియోగించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, మిస్సైళ్లలో మూడు దేశాల నేవిగేషన్ టెక్నాలజీ ఉంది. అమెరికాకు చెందిన జీపీఎస్, రష్యాకు చెందిన గ్లోనాస్, చైనాకు చెందిన బైడూస్ నేవిగేషన్ వ్యవస్థలు వాటిలో ఉన్నాయి. ఆ నేవిగేషన్ ఆధారంగానే భారత్‌పై గగనతల దాడులకు పాకిస్తాన్ యత్నించే అవకాశం ఉంది. అందుకే ఆయా నేవిగేషన్ వ్యవస్థలను జామ్ చేసే అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను(Electronic Warfare) భారత్ రంగంలోకి దింపింది. ఇవి పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, మిస్సైళ్ల నేవిగేషన్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి. దీంతో అవి భారత్‌లోని సరైన లొకేషన్‌లను గుర్తించే విషయంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధ రంగంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ వాయుసేన చేరుకుంటుంది.
Also Read :Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?
భారత్ వద్ద స్వదేశీ నేవిగేషన్ టెక్నాలజీ
ఇలాంటి యుద్ధాలు వస్తాయనే ఆందోళనతోనే భారత్ స్వదేశీ శాటిలైట్ ఆధారిత నేవిగేషన్ టెక్నాలజీ నావిక్‌ను తయారు చేసుకుంది. దీన్ని ఇతరులు హైజాక్ చేయలేరు. యుద్ధ సమయాల్లో అమెరికా, రష్యాలు వాటి నేవిగేషన్ వ్యవస్థలను భారత్‌లో స్తంభింపజేసే ముప్పు ఉంది. అలాంటప్పుడు స్వదేశీ నేవిగేషన్ టెక్నాలజీ నావిక్‌ను భారత్ వాడుకుంటుంది. ఇక భారత్ దాడి చేయొచ్చనే భయంతో కీలకమైన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న తమ సైనిక స్థావరానికి పాకిస్తాన్ తరలించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా వీక్‌గా ఉంది. పాత యుద్ధ విమానాలు ధ్వంసమైతే, కొత్త యుద్ధ విమానాలను కొనే స్థితిలో ఆ దేశం లేదు.