Brahmaputra River : బ్రహ్మపుత్ర నీటిపై పాక్‌ ప్రచారం.. అస్సాం సీఎం కౌంటర్‌!

సింధూ ఒప్పందం కాలపరిమితి దాటి, భారత్‌ తన హక్కులను సమర్థించుకుంటుంటే, పాకిస్థాన్‌ బ్రహ్మపుత్ర నీటి ప్రయోగంతో బెదిరించడానికి చూస్తోంది. కానీ ఇది వాస్తవాధారాలు లేని భయం. చైనా నుంచి భారత్‌కు వచ్చే నీటి భాగస్వామ్యం తక్కువ అని శర్మ స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Pakistan's campaign on Brahmaputra water.. Assam CM counters!

Pakistan's campaign on Brahmaputra water.. Assam CM counters!

Brahmaputra River : భారత ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత, పాకిస్థాన్‌ మరో “నీటి భయం” ప్రచారానికి తెరలేపింది. చైనా బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తే భారత్‌ పరిస్థితి ఏమిటి? అన్న వాదనతో పాక్‌ కొత్త కథను ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఊహాజనిత దుష్ప్రచారాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గణాంకాలతో తిప్పికొట్టారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఆయన దీని గురించి సుదీర్ఘంగా స్పందించారు. సింధూ ఒప్పందం కాలపరిమితి దాటి, భారత్‌ తన హక్కులను సమర్థించుకుంటుంటే, పాకిస్థాన్‌ బ్రహ్మపుత్ర నీటి ప్రయోగంతో బెదిరించడానికి చూస్తోంది. కానీ ఇది వాస్తవాధారాలు లేని భయం. చైనా నుంచి భారత్‌కు వచ్చే నీటి భాగస్వామ్యం తక్కువ అని శర్మ స్పష్టం చేశారు.

Read Also: Trade deal : త్వరలో భారత్‌తో ట్రేడ్‌ డీల్‌: అమెరికా

బ్రహ్మపుత్ర నది చైనాలో యార్లుంగ్‌ త్సాంగ్‌పోగా ప్రారంభమవుతుంది. కానీ భారత్‌లోకి ప్రవేశించిన తరువాతే అది విస్తృతమవుతుంది. చైనా నుంచి భారత్‌కు వచ్చే నీటి వాటా కేవలం 30–35 శాతమే. ఇది కూడా ప్రధానంగా మంచు కరుగుదల మరియు టిబెట్‌లో కొద్దిపాటి వర్షాలపై ఆధారపడినదే. మిగిలిన 65–70 శాతం నీరు భారతదేశంలోనే, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వర్షాల ద్వారా లభిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌, అస్సాం, నాగాలాండ్‌, మేఘాలయాల్లో మోన్సూన్ వర్షాలు బ్రహ్మపుత్ర నదికి జీవం పోస్తాయి. శుభాంశ్రీ, లోహిత్‌, మానస్‌, ధన్‌శ్రీ వంటి ఉపనదులు, ఖాసీ, గారో కొండల నుంచి వచ్చే చిన్ననదులు ఇవన్నీ భారతదేశపు వర్షభాగస్వామ్యాన్ని తెలియజేస్తాయి.

భారత్‌-చైనా సరిహద్దులో బ్రహ్మపుత్ర ప్రవాహం సెకనుకు 2,000–3,000 క్యూబిక్ మీటర్లు ఉండగా, అస్సాంలో మోన్సూన్ సమయంలో అది సెకనుకు 15,000–20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుంది. ఇది నది భారత భూభాగంలోకి వచ్చిన తరువాతే దాని బలం ఎంతగానో పెరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఒకవేళ చైనా నీటి ప్రవాహాన్ని తగ్గిస్తే, అది అస్సాంలో వరదల తీవ్రతను తగ్గిస్తుంది. లక్షలాది మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారు అని శర్మ హితవు పలికారు. ఇప్పటివరకు చైనా ఏ వేదికపై కూడా నీటిని ఆపుతామన్న హెచ్చరికలు ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు.

సింధూ ఒప్పందం ద్వారా పాకిస్థాన్‌ అనవసరంగా లబ్ధి పొందింది. ఇప్పుడు భారత్‌ తన హక్కులను వాదించడమే పాక్‌ను కలవరపెడుతోంది. కానీ బ్రహ్మపుత్ర నది పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. ఇది వర్షాధారిత నది. దాన్ని ఒక్క దేశం నియంత్రించలేదు అని శర్మ తేల్చి చెప్పారు. సెంటర్‌ ఫర్‌ చైనా అండ్ గ్లోబలైజేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విక్టర్‌ జికాయ్ గావ్ వ్యాఖ్యలు ఈ దుష్ప్రచారానికి ముడి పెట్టాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను పాక్‌ మీడియా విపరీతంగా ప్రచారం చేసి, చైనా-భారత్ మధ్య నీటి వివాదం అంటూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేసింది అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టంగా తెలిపారు. బ్రహ్మపుత్రపై చైనా నియంత్రణ నదికి అంతగా ప్రభావం చూపదని, భారత్‌ పూర్తిగా స్వతంత్రంగా బ్రహ్మపుత్ర జలాలను వినియోగించగలదని గణాంకాలతో సాక్షాత్కరించారు. పాకిస్థాన్‌ చేసిన నిరాధార ప్రచారానికి ఇది కఠిన సమాధానమే.

Read Also: Usha Vance : భారత పర్యటన మరువలేని అనుభవం.. మోడీ తాతలా మెలిగారు..!

  Last Updated: 03 Jun 2025, 11:32 AM IST