Pak With Terrorists: ‘ఆపరేషన్ సిందూర్’ అనేది పాకిస్తాన్‌పై పోరాటం కాదని, ఉగ్రవాదంపై పోరాటమని భారత త్రివిధ దళాల అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాద స్థావరాలను భారత సేనలు ధ్వంసం చేస్తుండగా పాకిస్తాన్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామని వెల్లడించారు. భారత సేనలు ఉద్దేశపూర్వకంగా పాక్ సైన్యంపై దాడులు చేయలేదని వారు తేల్చి చెప్పారు. పాకిస్తాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని ఆరోపించారు. పాకిస్థాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు.‘ఆపరేషన్ సిందూర్’పై ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత సైనిక ఉన్నతాధికారులు రాజీవ్ ఘయ్, ఏకే భారతి, ఏఎన్ ప్రమోద్‌లు మాట్లాడారు.
Also Read :Pakistan Map : కశ్మీరును పాక్‌లో కలిపేసేలా మ్యాప్.. చిన్న పొరపాటే అంటున్న డీకే
భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయి
‘‘పాకిస్తాన్ దాడులు చేసిన సమయంలో భారత(Pak With Terrorists) గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయి. దీనివల్ల పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్ల ఆటలు సాగలేదు. పాకిస్తాన్ దాడులకు ప్రతిచర్యగానే మేం పాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడి చేశాం’’ అని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. భారత్ దాడి చేసిన దృశ్యాలను వారు ఈసందర్భంగా మీడియా ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. ‘ఆపరేషన్ సిందూర్ ’లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లోనూ భారత సేనలు కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు.
Also Read :India-Pak : భారత్, పాక్ చర్చలు వాయిదా.. ప్రధాని, అజిత్ దోవల్ కీలక చర్చలు
ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థలను వాడుకున్నాం
‘‘పాకిస్తాన్ జరిపిన దాడుల్లో భారత సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థను ఈ ఆపరేషన్‌లో సమర్థంగా వినియోగించాం. భారత సైన్యం పాకిస్తాన్ సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు. చైనా తయారు చేసిన పీఎల్-15 క్షిపణిని భారత సైన్యం నేలకూల్చింది. పాకిస్తాన్‌కు చెందిన అనేక డ్రోన్లు, మిసైళ్లను భారత్ కూల్చింది’’ అని భారత త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. ‘‘భారత్ వైపు పాకిస్తాన్ గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించాం. ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్లు, రాడార్లు, ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను వినియోగించాం. నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించాం’’ అని వైస్ అడ్మిరల్ ప్రమోద్ వివరించారు. ‘‘పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. మన స్వదేశీ ప్రతిస్పందన వ్యవస్థ చాలా బలమైంది. సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని ఆయన ప్రకటించారు.