Site icon HashtagU Telugu

Asaduddin Owaisi : చైనా ఆర్మీ డ్రిల్ ఫొటోతో నాటకాలు.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లపై ఒవైసీ ఫైర్

Asaduddin Owaisi Kuwait All Party Delegation Pakistan Prime Minister Army Chief

Asaduddin Owaisi: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ  చీఫ్ ఆసిమ్ మునీర్‌లను మించిన ఫూల్స్ మరెవరూ లేరని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు.  ‘‘ఇటీవలేే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఒక ఫొటోను బహుమతిగా ఇచ్చాడు. ఈ తెలివితక్కువ జోకర్లు భారతదేశంతో పోటీ పడాలని అనుకుంటున్నారు. వాళ్లు 2019 నాటి చైనా ఆర్మీ డ్రిల్ ఫొటోను ఇచ్చుకున్నారు. ఆ ఫొటోను చూపించి, తాము భారతదేశంపై విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ సక్సెస్ అయిందని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. పాకిస్తాన్ ఇలాగే మూర్ఖంగా పనిచేస్తుంది’’ అని ఒవైసీ కామెంట్ చేశారు. కనీసం కాపీ కొట్టే తెలివి కూడా పాకిస్తాన్ పాలకులకు లేదని ఆయన ధ్వజమెత్తారు. పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మరని, అది అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని పేర్కొన్నారు.  పాక్ వాదనలో చిటికెడు ఉప్పు అంతటి నిజం కూడా లేదన్నారు. పాక్ ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్త ప్రచారం కోసం బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో భారత్ నుంచి వెళ్లిన అఖిలపక్ష ప్రతినిధి బృందంలో అసదుద్దీన్ ఒవైసీ సభ్యుడిగా ఉన్నారు. కువైట్‌లోని ప్రవాస భారతీయులతో జరిగిన సంభాషణ సందర్భంగా ఆయన తాజా కామెంట్స్ చేశారు.

Also Read :New UPI Rules : ఆగస్టు 1 నుంచి కొత్త యూపీఐ రూల్స్‌.. తప్పక తెలుసుకోండి

పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చాలి

‘‘పాకిస్తాన్ తన సైనిక, ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడానికి 2 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) రుణాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే పాకిస్తాన్‌ను మళ్లీ  ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో చేర్చాలి. FATF గ్రే లిస్ట్ ప్రాముఖ్యత ఏమిటంటే.. ఈ లిస్టులో ఉన్న దేశం ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు భారీ పరిశీలన జరుగుతుంది’’ అని అసదుద్దీన్ ఒవైసీ వివరించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మనీలాండరింగ్, హవాలా లావాదేవీల ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ స్పాన్సర్‌షిప్ అందిస్తోందన్నారు.

Also Read :Terror Links Case: విజయనగరం‌లో పేలుళ్లకు కుట్ర.. సౌదీ, పాక్‌లలో సిరాజ్‌కు ట్రైనింగ్

భారతీయ ముస్లింలే ఎక్కువ నిజాయితీపరులు

భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్(Asaduddin Owaisi)  మతపరమైన అంశాలను లేవనెత్తడాన్ని ఒవైసీ ఖండించారు.  పాకిస్తాన్ కంటే భారత్‌లోనే ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ఉన్నారని పాక్ ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. పాకిస్తానీల కంటే భారతీయ ముస్లింలే ఎక్కువ నిజాయితీపరులని ఒవైసీ స్పష్టం చేశారు.  ఒవైసీ, బైజయంత్ పాండాలతో కూడిన అఖిలపక్ష టీమ్‌లో నిశికాంత్ దూబే, ఫాంగ్నోన్ కొన్యాక్, రేఖా శర్మ, సత్నామ్ సింగ్ సంధు, గులాం నబీ ఆజాద్, దౌత్యవేత్త హర్ష్ ష్రింగ్లా ఉన్నారు.