Sea Blockade : ఒకవేళ యుద్ధమే మొదలైతే.. పాకిస్తాన్‌ను భారత్ తొలుత జల దిగ్బంధం చేసే అవకాశం ఉంటుంది. పాక్‌లోని కరాచీ, గ్వాదర్ ఓడరేవులను అదుపులోకి తీసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఈక్రమంలో ఈ నెల 24న ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్ క్షిపణులను భారత్ టెస్ట్ చేసింది. యుద్ధవిమానాలు, యూఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేల కూల్చడానికి ఎంఆర్‌శామ్ ఉపయోగపడుతుంది. ఇక అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను భారత నేవీ పరీక్షించింది. భారత్‌కు చెందిన విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ప్రస్తుతం కర్ణాటకలోని కార్వార్ నౌకాస్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో సంచరిస్తోంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అధునాతన యుద్ధనౌక.
Also Read :BRS Meeting : బీఆర్ఎస్ రజతోత్సవంలో కవితకు దక్కని ప్రయారిటీ !
విమానవాహక నౌక అంటే..
విమానవాహక నౌక(Sea Blockade) అంటే ఆషామాషీ ముచ్చట కాదు. ఇందులో జలాంతర్గాములు, డెస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, యుద్ధ విమానాలు, మిస్సైళ్లు వంటివన్నీ ఉంటాయి. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి విమానవాహక నౌక ఉపయోగపడుతుంది. ఒకవేళ కరాచీ, గ్వాదర్ ఓడరేవులను భారత నౌకాదళం దిగ్బంధిస్తే.. పాక్ విలవిలలాడుతుంది. ఎందుకంటే ఆ దేశ వాణిజ్యంలో 60 శాతానికిపైగా ఈ రెండు ఓడరేవుల నుంచే జరుగుతోంది. పాక్ తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా భారత్ జలదిగ్బంధం చేస్తే.. పాకిస్తాన్‌లో పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది. దేశంలోని దాదాపు మూడోవంతు విద్యుదుత్పత్తి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది.
Also Read :PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో ఏమేం ఉంటాయి ?
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై మిగ్-29 యుద్ధవిమానాలు, కామోవ్-31 వంటి హెలికాప్టర్లు సహా మొత్తం 40 విమానాలను మోహరించొచ్చు. దీనిపై 64 బరాక్ క్షిపణులు, శక్తిమంతమైన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు ఉంటాయి. ఒటోబ్రెడా 76 ఎంఎం గన్స్, ఏకే-630 క్లోజిన్ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సర్లు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఉన్నాయి. శత్రు వైమానిక, క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీనిలో ఉంది. 1971 నాటి యుద్ధంలో కరాచీ ఓడరేవుపై భారత నౌకాదళం దాడి చేసింది. ఆనాటి యుద్ధంలో భారత నౌకాదళం చర్యలు మనదేశ విజయానికి దోహదపడ్డాయి. ఈసారి కూడా యుద్దం జరిగితే భారత నౌకాదళం కీలక పాత్ర పోషించనుంది.