Pakistan Airspace : జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయింది. బుధవారం తెల్లవారుజామున 1:05 గంటల నుంచి 1:30 గంటల వరకు 25 నిమిషాల పాటే ఈ సైనిక ఆపరేషన్ జరిగింది. ఇంత స్వల్ప వ్యవధిలో 9 ఉగ్ర స్థావరాలను 24 క్షిపణులు, ఉపగ్రహ గైడెడ్ గ్లైడ్ బాంబులతో భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడులను భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన సంయుక్తంగా పరస్పర సమన్వయంతో నిర్వహించాయి. భారత్ దాడి చేశాక పాకిస్తాన్ గగనతలం మొత్తం ఖాళీ అయింది. పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుంచి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్‌లో అంతర్గతంగా విమానాల రాకపోకలను పూర్తిగా ఆపేశారు. దీంతో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఖాళీ అయినట్లు తెలిసింది.
ఆసియా ఖండంలోని విమానయాన సంస్థలన్నీ..
పాకిస్తాన్‌పై భారత్ వైమానిక దాడులు చేయొచ్చనే భయంతో ఆసియా ఖండంలోని అన్ని దేశాల విమానయాన సంస్థలు అలర్ట్ అయ్యాయి. పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులను ఇతర దేశాలకు దారి మళ్లించాయి. ఇక ఇదే సమయంలో మన భారతదేశానికి చెందిన ఎయిర్ స్పేస్ బిజీగా కనిపించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన పిక్టోరియల్ ఫొటోను ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ విడుదల చేసింది.
Also Read :Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. సౌత్ సినీ స్టార్స్ స్పందన ఇదీ
పాక్‌పై భారత్ ఎటాక్.. చైనా వెరైటీ స్పందన
పాకిస్తాన్‌పై భారత్(Pakistan Airspace) దాడి చేసిన తర్వాత చైనా విదేశాంగ శాఖ నుంచి కీలక స్పందన వచ్చింది. పాకిస్తాన్ తమకు మిత్రదేశం అని చెబుతున్న చైనా.. ఈవిషయంపై ఆచితూచి మాట్లాడింది. ‘‘భారతదేశం చర్యను చైనా విచారకరంగా భావిస్తోంది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి మేం ఆందోళన చెందుతున్నాం. భారతదేశం, పాకిస్తాన్ రెండూ మాకు పొరుగుదేశాలు. అయితే మేం అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తాం. శాంతి, స్థిరత్వ ప్రయోజనాల కోసం భారత్, పాకిస్తాన్‌లు కలిసికట్టుగా పనిచేయాలి. శాంతిని నెలకొల్పాలి. సంయమనం పాటించాలి. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని మేం కోరుతున్నాం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.