Site icon HashtagU Telugu

Bomb Threat : దేశ రాజధానిలో హైఅలర్ట్.. 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Bomb Threat To Delhi Schools

Bomb Threat :  బెదిరింపు మెసేజ్‌ల పరంపర ఆగడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలోని 44 పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా స్కూళ్లకు ఈ వార్నింగ్ మెసేజ్‌లు వచ్చాయి. బెదిరింపులు అందుకున్న స్కూళ్ల జాబితాలో పశ్చిమ విహార్‌లోని డీపీఎస్ ఆర్‌‌కే పురం, జీడీ గోయెంకా స్కూల్  కూడా ఉన్నాయి. ఇవాళ ఉదయం 6:15 గంటలకు జీడీ గోయెంకా స్కూల్ నుంచి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు మొదటి ఫోన్ కాల్ వచ్చింది. ఉదయం  7:06 గంటలకు డీపీఎస్ ఆర్కే పురం నుంచి మరొక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయా స్కూళ్లలో పోలీసుల డాగ్ స్క్వాడ్‌లు, బాంబ్ స్క్వాడ్‌లు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఇళ్లకు పంపించారు.

Also Read :Skin Care: 21 రోజుల్లో మీరు అందంగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!

బెదిరింపు ఈమెయిల్ ఆదివారం రాత్రి 11:38 గంటలకు వచ్చింది. స్కూళ్ల భవనాల్లో పలు బాంబులు(Bomb Threat) అమర్చామని ఈమెయిల్‌లో ప్రస్తావించారు.  “బాంబులు చిన్నవి.. చాలా బాగా దాచాం” అని దుండుగులు ఈమెయిల్‌లో పేర్కొన్నారు.  ఆ బాంబులను నిర్వీర్యం చేయాలంటే తమకు రూ.25 లక్షలు ఇవ్వాలని ఈమెయిల్ పంపిన దుండగులు డిమాండ్ చేశారు. ‘‘మేం అమర్చిన బాంబుల వల్ల  భవనానికి పెద్దగా నష్టం కలగదు. కానీ బాంబులు పేలినప్పుడు చాలా మంది గాయపడతారు. మీరందరూ బాధపడటానికి, అవయవాలను కోల్పోవటానికి అర్హులు’’ అని కూడా ఈమెయిల్‌లో రాసుకొచ్చారు. ఈమెయిల్ పంపిన సిస్టమ్‌కు చెందిన ఐపీ అడ్రస్ ఆధారంగా దుండగుల లొకేషన్‌ను ట్రాక్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు యత్నిస్తున్నారు.

అక్టోబర్‌లో ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్‌లో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాఠశాల వెలుపల పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పాఠశాల గోడతోపాటు సమీపంలోని దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.ఇది జరిగిన మరుసటి రోజు (అక్టోబర్ 21) ఉదయం 11 గంటలకు అన్ని CRPF పాఠశాలల్లో బాంబు పేలుడు జరుగుతుందని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి.. ఆ బెదిరింపు బూటకమని తేల్చారు. ఇటీవలే తాజ్ మహల్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా బెదిరింపులు వచ్చాయి.