Site icon HashtagU Telugu

Indian Warships : 10 యుద్ధనౌకలు, అత్యాధునిక డ్రోన్లు రంగంలోకి.. ఎందుకు ?

Indian Warships

Indian Warships

Indian Warships : ఇజ్రాయెల్ – గాజా యుద్ధం ఎర్ర సముద్రంతో పాటు అరేబియా సముద్రానికీ దాదాపుగా విస్తరించింది. భారత్‌ను ఆనుకొని ఉండే అరేబియా సముద్రంలో ఇటీవల ఒక ఇజ్రాయెలీ నౌకపై జరిగిన డ్రోన్ దాడి యెమన్ హౌతీ మిలిటెంట్ల పనే అయి ఉండొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి  సముద్రంలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని ఆఫ్రికా దేశాలకు చెందిన సముద్రపు దొంగలు చెలరేగుతున్నారు. నౌకలను హైజాక్ చేసేందుకు తెగబడుతున్నారు. ఇటీవల దాదాపు 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్‌ను సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసి తీసుకెళ్లగా భారత నేవీ రక్షించి తీసుకొచ్చింది. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసేందుకు భారత్ రెడీ అయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తర, మధ్య అరేబియా సముద్రం నుంచి మొదలుకొని ఏడెన్ గల్ఫ్ వరకు ఉన్న ప్రాంతంలో పహారా కోసం భారత నౌకాదళం పదికి పైగా యుద్ధనౌకలను మోహరించింది.ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ R హరి కుమార్ ఈవివరాలను వెల్లడించారు. అయితే ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు పహారా కోసం  అమెరికా ప్రారంభించిన బహుళజాతి సైనిక కూటమి ‘ఆపరేషన్ ప్రాస్పిరిటీ గార్డియన్’‌లో  భారత్ చేరబోదని స్పష్టం చేశారు. అయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి స్నేహపూర్వక దేశాలతో  అవసరమైన సైనిక సమాచారాన్ని  ఇచ్చిపుచ్చుకుంటుందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్ (IFC-IOR) కూడా అప్రమత్తంగా ఉంటుందన్నారు.

అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసిన సాయుధ డ్రోన్ల పేరు ‘ఎంక్యూ 1 ప్రిడేటర్‌’. వాటిని కూడా అరేబియా సముద్రంలో నిఘా కోసం భారత నేవీ మోహరించింది. దీర్ఘ శ్రేణి సముద్ర గస్తీ విమానం P-8I, సముద్ర సంరక్షక డ్రోన్లను కూడా రంగంలోకి దింపింది. ఈ డ్రోన్ల ద్వారా సుదూర సముద్ర జలాలకు సంబంధించిన  హై రెజల్యూషన్ లైవ్ ఫీడ్‌లను భారత ఆర్మీ పొందనుంది. అరేబియా సముద్రంలో భారత్ మోహరించిన యుద్ధ నౌకలు, డెస్ట్రాయర్ల జాబితాలో ఐఎన్‌ఎస్ కొచ్చి, ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ మోర్ముగో, ఐఎన్‌ఎస్ చెన్నై ఉన్నాయి. ఇక మల్టీ రోల్ ఫ్రిగేట్స్ ఐఎన్‌ఎస్ తల్వార్, ఐఎన్‌ఎస్ తార్కాష్‌(Indian Warships)లను కూడా నేవీ వినియోగిస్తోంది. సముద్ర నిఘా మరియు భద్రతా ప్రయోజనాల కోసం డోర్నియర్, హెలికాప్టర్లను కూడా మోహరించారు. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (EEZ)పై సమర్థవంతమైన నిఘా ఉండేలా భారత నావికాదళం, కోస్ట్ గార్డ్‌తో కలిసి సమన్వయంతో పని చేస్తోంది.