Modi : విపక్షాల విడివిడి యాత్రలు మోడీని ఎదుర్కోగలవా?

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 12:15 PM IST

డా. ప్రసాదమూర్తి

జనవరి 22వ తేదీ వైపు దేశం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అయోధ్యలో నవనిర్మిత రామ మందిర ప్రారంభోత్సవం దేశవ్యాప్త మహోత్సవంగా నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, అలాగే విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంఘాలు అతి సంబరంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. సగం సగం నిర్మాణమైన మందిరాన్ని ప్రారంభించడం పట్ల, ఆ మందిరంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ నడుం కట్టడం పట్ల నాలుగు పీఠాల శంకరాచార్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు కాగా బిజెపి వారు రామ మందిర ప్రారంభోత్సవ ధర్మకాండను తమ రాజకీయ కర్మకాండగా మార్చుకోవడాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు తమదైన శైలిలో యాత్రలు ప్రారంభించాయి. రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో న్యాయ యాత్రను మణిపూర్ నుంచి ప్రారంభించారు. గత పదేళ్లుగా దేశంలో అనేక వర్గాలు అనేక విధాల అణిచివేతకు గురై న్యాయానికి దూరమై హక్కుల కోసం అభివృద్ధి కోసం ఎదురు తెన్నులు చూస్తున్న నేపథ్యంలో వారికి న్యాయం కోసం రాహుల్ గాంధీ యాత్రను ప్రారంభించినట్టు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరో యాత్రను ప్రారంభించారు. దీని పేరు “సంవిధాన్ బచావో, దేశ్ బచావో, సమాజవాది పిఛడే, దళిత్, అల్ప సంఖ్యక్ యాత్ర”. దేశంలో దళితులు, వెనకబడిన వర్గాలు, మైనారిటీల ఉద్ధరణ కోసం ఉద్దేశించింది ఈ యాత్ర. ప్రముఖ సోషలిస్టులైన రామ్ మనోహర్ లోహియా, ములాయం సింగ్ తదితర ప్రముఖుల కలలను సాకారం చేయడానికి ఈ యాత్రను చేపట్టినట్టు అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఈ యాత్రను ఆయన నిన్న లక్నోలో ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

సయోధ్యలేని విపక్షాలు:

రామ మందిర వ్యవహారాన్ని తమ రాజకీయ ఎజెండాగా మార్చుకొని రెండు మూడు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి బిజెపి వారు అడుగులు కదుపుతున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు చేసే ఏ యాత్ర అయినా, ఏ పని అయినా, ఆ కార్యక్రమాల పట్ల ఒక ఐక్యతా భావం, ఒక అంకితభావం ప్రజలకు కనిపించాలి. కాంగ్రెస్ పార్టీ వారు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ న్యాయ యాత్రలో విపక్షాల ఇండియా కూటమికి చెందిన పార్టీల వారిని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పినా, తమకు ఎలాంటి ఆహ్వానం రాలేదని అఖిలేష్ యాదవ్ చెప్పారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విపక్షాలను ఒక తాటిమీద నడిపించి దానికి సారధ్యం వహించే కాంగ్రెస్ పార్టీ ఇలా తమ మిత్రులను దూరం చేసుకుంటే ఎలా అనేది అర్థం కాని విషయం. అందునా రాహుల్ గాంధీ తాను నిర్వహిస్తున్న ఈ న్యాయయాత్ర 11 రోజులపాటు ఉత్తరప్రదేశ్లో 20 జిల్లాల్లో 1,074 కిలోమీటర్లు కవర్ చేస్తారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలిలో, అలాగే లక్నో, ప్రయాగరాజ్, బరేలి, ఆగ్రా మొదలైన జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఆ రాష్ట్రంలో అతి కీలకమైన 20 జిల్లాల్లో తన యాత్ర సాగిస్తూ, అదే రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా కొనసాగుతున్న తమ మిత్రపక్షమైన సమాజ్వాది పార్టీని యాత్రకు ఆహ్వానించకపోవడం విచిత్రమైన విషయమే. అసలు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్వాది పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోకపోవడం పట్ల ఆ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కినుక వహించి ఉన్నారు. ఇలాంటి అగాథాలను పూడ్చుకోవడానికి ఈ యాత్రను ఒక వంతెనగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వారు విస్మరించడం రాజకీయ వర్గాలలో పలు సందేహాలకు తావిస్తోంది. ఇలా ఎవరికి వారు తమ యాత్రలు తాము చేసుకుంటూ, తమ కార్యక్రమాలు తాము చేసుకుంటూ, అందరూ కలిసి ఉన్నామని చెబుతూనే ఎవరికి వారు విడివిడిగా నడుస్తూ పోతుంటే ఇక కలిసికట్టుగా మోడీ అండ్ టీం ని ఎలా ఎదుర్కోగలరు అనేది పెద్ద ప్రశ్న. ప్రతిపక్షాలు సమైక్యంగా ఒక దేశవ్యాపిత మహా యాత్రను చేయాల్సింది పోయి, ఒంటరి పోరాటాలు, ఒంటరి యాత్రలు చేయడం వారి బలాన్ని కాదు వారి బలహీనతను మాత్రమే తెలియజేస్తుంది.

Read Also : Sagar-Srisailam: సాగ‌ర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం, కృష్ణా బోర్డుకు అప్ప‌గించాల‌ని ఆదేశం