పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి ప్రతీకారం తీర్చుకుంటూ భారత త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా “ఆపరేషన్ సిందూర్”(Operation Sindoor)ను విజయవంతంగా అమలు చేశాయి. బుధవారం తెల్లవారుజామున 1.05 గంటలకు మొదలై 1.30 గంటలకే ముగిసిన ఈ ఆపరేషన్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)తో పాటు పాకిస్తాన్ అంతర్భాగంలో ఉన్న మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశారు. మెరుపు వేగంతో దాడులు జరిపిన భారత సైన్యం, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ప్రధాన ఉగ్ర సంస్థల కేంద్రాలను ధ్వంసం చేసింది.
Masood Azhar : ‘ఆపరేషన్ సిందూర్’తో మసూద్ అజార్ రక్త కన్నీరు.. ‘‘నేనూ చనిపోతే బాగుండేది’’
ఈ దాడులు అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించబడి, పౌరులకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి మీడియాకు తెలిపారు. ఈ దాడుల్లో స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హ్యామర్ బాంబులు, లోయిటరింగ్ మ్యూనిషన్‌ల వంటి అధునాతన ఆయుధాలను భారత సైన్యం వినియోగించింది. లక్ష్యంగా ఎంచుకున్న 9 శిబిరాల్లో మురిద్కే, సియాల్‌కోట్, బహవల్‌పూర్, ముజఫరాబాద్, కోట్లీ ప్రాంతాల్లో ఉన్న శిక్షణా కేంద్రాలు, ఆయుధ నిల్వలు, చొరబాటు స్థావరాలున్నాయి. ఇవన్నీ భారత భద్రతా వర్గాల నిఘాతో సంపూర్ణంగా నిర్ధారించబడిన సమాచారం ఆధారంగా గుర్తించబడ్డాయి.
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పాక్‌కు గట్టి హెచ్చరికగా మారింది. “25 నిమిషాల్లోనే ఈ స్థాయిలో తూటాలు కురిపించగల సామర్థ్యం మన సైన్యంలో ఉందంటే… 24 గంటలు సమయం ఇస్తే ఏం చేస్తారు?” అనే ప్రశ్నతో దేశవ్యాప్తంగా భారత సైన్యం శౌర్యానికి జై.. జై..లు పలుకుతున్నారు. గత 3 దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఇదొక గట్టి దెబ్బగా నిలిచింది. ఇది కేవలం ప్రతీకారం మాత్రమే కాక, భవిష్యత్తులో అలాంటి చర్యలకు అడ్డు వేయడం లక్ష్యంగా భారత త్రివిధ దళాలు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా అమలు చేశాయి.