India : భారతదేశపు త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశభద్రతపై నూతన దృష్టికోణాన్ని నింపుతున్నాయి. మౌలోని ఆర్మీ వార్ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన ‘రణ్ సంవాద్’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. “ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు అది కొనసాగుతోంది ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్‌ను గుర్తుచేస్తూ పాకిస్థాన్‌కి పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారతదేశం శాంతిని కోరుకునే దేశం. కానీ శాంతిని మన బలహీనతగా ఎవరైనా భావిస్తే, వాళ్లకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుంది. భారత శాంతియుత ధోరణి వెనుక ఉన్న శక్తిని గుర్తించాలని ఆయన హితవు పలికారు.
యుద్ధాల స్వరూపం మారిపోతోంది
నేటి యుద్ధాలు గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని జనరల్ చౌహాన్ విశ్లేషించారు. గతంలో యుద్ధాలు భూభాగం కోసం జరిగేవి. ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం పెరిగింది. విజయాన్ని కొలిచే ప్రమాణాలు మారాయి. నష్టాన్ని కాకుండా, దాడుల వేగం, సమర్థతే కీలకం అయింది అని ఆయన వివరించారు. అలానే, యుద్ధం మరియు శాంతి మధ్యనున్న గడుగు కూడా అదృశ్యమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశాలు తమ రాజకీయ లక్ష్యాలను సాధించడానికి చిన్న పరిమాణం కలిగిన యుద్ధాలను ఆయుధంగా మారుస్తున్నాయి. ఇది ఒక ప్రమాదకర ధోరణి.
భవిష్యత్తు కోసం సన్నద్ధత అవసరం
వికసిత భారత్ సాధించాలంటే, దేశం మిలటరీ పరంగా ‘సశస్త్ర’, దేశ భద్రత పరంగా ‘సురక్షిత్’, ఆర్ధిక స్వావలంబన పరంగా ‘ఆత్మనిర్భర్’ అయి ఉండాలన్నది ఆయన అభిప్రాయం. సాంకేతికతలోనే కాదు, ఆలోచనల్లోనూ స్వయం సమృద్ధిని సాధించాలి అంటూ జాతిని కలుసుకునే మార్గాన్ని చాటారు. అంతేగాక భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనాలంటే త్రివిధ దళాల మధ్య సమన్వయం మరింత అవసరమని ఆయన నొక్కిచెప్పారు. వాయు, జల, భూతల మార్గాల్లో మారుతున్న మిలటరీ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటేనే భద్రతా రంగం ముందుకు పోగలదని తెలిపారు.
‘రణ్ సంవాద్’లో కీలక చర్చలు
రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ‘రణ్ సంవాద్’ సదస్సు భారత భద్రత, రక్షణ వ్యూహాలు, మిలటరీ అభివృద్ధిపై మేథావులు, అధికారుల మధ్య చర్చలకు వేదికవుతోంది. చివరి రోజు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించనున్నారు. జనరల్ చౌహాన్ వ్యాఖ్యలు భారత మిలటరీ ధోరణిలోని నూతన దిశను సూచిస్తున్నాయి. శాంతిని కోరుకుంటూనే, దేశ రక్షణ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో భారతం ఎంత ముందుండబోతుందో ఈ ప్రసంగం స్పష్టంగా తెలియజేస్తోంది.
Read Also: PM Modi : భారత్ ప్రపంచ హబ్‌గా మారుతుంది: ప్రధాని మోడీ