Site icon HashtagU Telugu

Operation Sindoor : భారతీయుల ఐక్యతా శక్తిని ఎవరూ ఢీకొనలేరు : ప్రధాని మోడీ

Operation Sindoor Pakistan Pm Modi Sikkims Statehood

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడి ద్వారా ఉగ్రవాదులు భారతీయుల్ని మత ప్రాతిపదికన విభజించాలని చూశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. పాకిస్తాన్‌ పన్నాగం కూడా అదేనన్నారు. ఈ పోరాటంలో భారతీయులే విజయం సాధించారని ఆయన తెలిపారు. భారతీయుల ఐక్యతా శక్తిని ఎవరూ ఢీకొనలేరని మోడీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని ఎయిర్ బేస్‌లను భారత్ దారుణ రీతిలో ధ్వంసం చేసిందని తెలిపారు. సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ వర్చువల్ గా మోడీ  తన సందేశాన్ని పంపించారు. నిజానికి ఇవాళ సిక్కింలో మోడీ నేరుగా పర్యటించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం ఉన్నందున ఆయన వర్చువల్ గా సిక్కిం రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని అందజేశారు.

Also Read :Double Votes Vs AI : ఏఐ టెక్నాలజీతో డబుల్ ఓట్ల ఏరివేత

అది మానవత్వంపై జరిగిన దాడి

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పహల్గాం ఉగ్రదాడి అనేది మానవత్వంపై జరిగిన దాడి. ఈ దాడిలో మన తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) రూపంలో ధీటైన సమాధానం ఇచ్చాం’’ అని మోడీ తెలిపారు. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సిక్కింను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ మార్చబోతున్నామని వెల్లడించారు. సిక్కింను యావత్ ప్రపంచానికి గ్రీన్ మోడల్ స్టేట్‌గా అభివృద్ధి చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. వికసిత భారత్ అనేది పేదలు, రైతులు, మహిళలు, యువత అనే నాలుగు బలమైన పునాదులపై రూపుదిద్దుకుంటోందని మోడీ పేర్కొన్నారు. సిక్కిం రైతులు వ్యవసాయంలో కొత్త ఒరవడులు సృష్టిస్తున్నారని, దీనివల్ల ఎంతోమంది సిక్కిం యువతకు కొత్త అవకాశాలు ఏర్పడతాయన్నారు.

Also Read :Meenakshi Natarajan : తెలంగాణ సర్కారు పనితీరుపై మీనాక్షి స్కాన్.. ఎమ్మెల్యేలతో భేటీలో కీలక అంశమదే

మోడీ 3 రోజుల పర్యటన

ఈరోజు (గురువారం) నుంచి మూడు రోజుల పాటు ప్రధాని మోడీ సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌‌లలో పర్యటించాల్సి ఉంది. ఆయాచోట్ల 6 బహిరంగ సభలతో పాటు రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు. వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.