Site icon HashtagU Telugu

One Nation One Election : లోక్‌సభ ఎదుటకు జమిలి ఎన్నికల బిల్లులు.. కేంద్రంపై విపక్షాలు ఫైర్

One Nation One Election Bill Lok Sabha Parliament Winter Session 2024

One Nation One Election : జమిలి ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు ఎట్టకేలకు ఇవాళ మధ్యాహ్నం లోక్‌సభ ఎదుటకు వచ్చాయి.  దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ వెంటనే బిల్లులపై సభలో చర్చను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, టీఎంసీ సహా విపక్ష పార్టీల ఎంపీలు జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా జమిలి ఎన్నికల బిల్లులను ఆమోదించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు.

Also Read :Shock To Russia : రష్యాలో కలకలం.. ‘న్యూక్లియర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’ అధిపతి హత్య

ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ ఈ బిల్లులకు తమ మద్దతును ప్రకటించింది. ఈవిషయాన్ని టీడీపీ తరఫున కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ లోక్‌సభలో వెల్లడించారు. జమిలి ఎన్నికల బిల్లులను సమగ్ర చర్చ కోసం తదుపరిగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి కేంద్ర ప్రభుత్వం పంపే అవకాశం ఉంది. జేపీసీ ప్రస్తుతం బీజేపీ ఎంపీయే సారథ్యం వహిస్తున్నారు. దీంతో ఈ బిల్లులకు జేపీసీ ఆమోదం లభించడం కూడా లాంఛనమే. ‘జమిలి’ బిల్లులపై చర్చ కోసం తొలుత జేపీసీకి 90 రోజుల గడువును ఇస్తారని తెలుస్తోంది. తదుపరిగా అవసరాన్ని, విపక్షాల డిమాండ్లను బట్టి ఈ గడువును మరింత పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.

Also Read :Google Vs ChatGPT : ‘గూగుల్ సెర్చ్‌’తో ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ ఢీ.. సరికొత్త ఫీచర్లు ఇవీ

జమిలి ఎన్నికల బిల్లులు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్ తివారీ(One Nation One Election) విమర్శించారు. ఆ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకే ఈ బిల్లులను తెస్తున్నారని సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్రయాదవ్‌ వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలు దేశంలో నియంతృత్వ వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల వల్ల దేశంలోని రాష్ట్రాల హక్కులకు విఘాతం కలుగుతుందన్నారు. జమిలి ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి వైరస్‌ లాంటివన్నారు. దేశంలోని ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేయాలే కానీ.. జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని  కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.