One Nation One Election Bill : లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహ మరో బిల్లును కేంద్రం మంగళవారం(డిసెంబరు17) లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఈ బిల్లును ఉభయసభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇక ఈ బిల్లును రేపు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి పంపనున్నారు. కాగా, జమిలి అనేది తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. ఒకవిధంగా ఏపీలో ఇప్పటికీ జరుగుతున్నది జమిలి ఎన్నికలే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుండాలి, ఢిల్లీ పీఠంపై ప్రధానిగా ఎవరు కూర్చోవాలి. ఇలా ఒకేసారి అన్ని రాష్ట్రాల సీఎంలను, పీఎంను ఎన్నుకోవడమే జమిలి. కాకపోతే.. ఇవే ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ-కార్పొరేషన్ ఎలక్షన్లు, వివిధ స్థానిక సంస్థల ఎన్నిలను కూడా ఒకేసారి జరుపుతారు. ఇవన్నీ దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయి. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు జరిగిన 100 రోజుల లోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని లోకల్‌బాడీ ఎలక్షన్స్‌ను పూర్తి చేస్తారు. జమిలి అంటే అర్థం ఇదే.
నిజానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాలు (సవరణ బిల్లు)ను సోమవారం సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రివైజ్ చేసిన లోక్‌సభ బిజినెస్ జాబితాలో వీటిని తొలగించారు. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను పెట్టలేదు. దీంతో ఈ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు. మంగళవారం ఈ బిల్లులు లోక్‌షభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ బిల్లులను విస్తృత పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కి సూచించే ముందు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ఏకీకృత ఎన్నికలకు మార్గం సుగమం చేసే బిల్లులు గత కొంతకాలంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అజెండాలో ఉన్నాయి. నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి.