Assembly Election : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ఉధృతం చేశాయి. ఈ మేరకు ఢిల్లీలోని ఘోండా నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 05న ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని ఢిల్లీలోని ప్రజలంతా అంటున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
ప్రజలకోసం ఇళ్లు నిర్మించే ప్రభుత్వం ఢిల్లీకు కావాలి. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులకోసం మా మేనిఫెస్టోలో పథకాలు రూపొందించాం అని అన్నారు. అబద్ధపు వాగ్దానాలు, మోసాలను ఢిల్లీ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయని, మొదటి 14 ఏళ్లు కాంగ్రెస్ హాయాంలో చోటుచేసుకున్న విపత్తు, ఇప్పుడు ఆప్ విపత్తు చూశామని, రెండూ కలిసి రెండు జనరేషన్లను పతనం చేశాయని మోడీ ఆరోపించారు. ఈరోజు వరకు కూడా ఢిల్లీలో ఆవే రోడ్ జామ్‌లు, వీధుల్లో మురికినీరు, కలుషిత తాగునీరు పరిస్థితి ఉందని, తాము 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి, మరో 25 ఏళ్లు పనులు కొనసాగించనున్నామని చెప్పారు.
ఇక, ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మండిపడ్డారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి తాగే నీటిలో విషం కలపగలదా? అని ప్రశ్నించారు. యుమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తోందన్నారు. చరిత్ర ఎన్నటికీ వాళ్లను క్షమించదు. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు. బీజేపీ మాత్రం ప్రజలకు స్వచ్ఛమైన జలాలను అందిస్తుంది అని మోడీ అన్నారు. యమున పేరుతో ఓట్లడిగారు. ఇప్పుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఢిల్లీని నీళ్లు అడుక్కునేలా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాపాలకు పాల్పడుతున్నారు. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించడం లేదా? అప్పుడు ఢిల్లీ జలాలను ఎలా విషమయం చేస్తుంది? ప్రధాని కూడా ఈ జలాలే తాగుతున్నారు.. అని మోడీ పేర్కొన్నారు.
Read Also: Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఇదేం కెప్టెన్సీ..?