Site icon HashtagU Telugu

OBC song by Rahul Gandhi : రాహుల్ గాంధీ నోట ఓబీసీ పాట

Obc Song By Rahul Gandhi

Obc Song By Rahul Gandhi

By: డా. ప్రసాదమూర్తి

OBC song by Rahul Gandhi : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో పాస్ చేసి భాగ్యాన్ని బిజెపి ప్రభుత్వం కైవసం చేసుకుంది. ఎవరు ఎప్పుడు ప్రారంభించారని కాదు, ఎవరు ఎప్పుడు దాన్ని లక్ష్యం వైపు తీసుకువెళ్లారు అనేదే ముఖ్యం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో పాసైనా, ఇందులో ఉన్న క్లాజుల రీత్యా అమలు కావడానికి మరో 15 ఏళ్ళు కూడా పట్టవచ్చు. అయినప్పటికీ కూడా 27 సంవత్సరాలుగా అంధకారంలో మగ్గుతున్న మహిళల న్యాయమైన హక్కు, ఇప్పటికి వెలుగు చూసే అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని వెలుగులోకి తెచ్చిన క్రెడిట్ కచ్చితంగా బిజెపి ప్రభుత్వం చేజిక్కించుకుంది. అయితే ఈ సమయంలో ఈ బిల్లులో ఓబీసీ (OBC) మహిళలకు సబ్ కోటా లేకపోవడం పెద్ద వివాదానికి దారి తీసింది.

ఈ విషయం మీద పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహిళల కోటాలో ఓబీసీ (OBC) మహిళలకు సబ్ కోటా లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే బిల్లుకు తమ సంపూర్ణమైన బేషరతు మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ మద్దతు ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీకి స్వలాభం కూడా ఉంది. రాజీవ్ గాంధీ ప్రారంభించిన మహిళా సాధికార ఉద్యమం ఇప్పటికైనా సాకారం అవుతుందని ఆ పార్టీ సంతోషం. అయితే ఈ బిల్లులో ఓబీసీ మహిళలకు ఎందుకు చోటు కల్పించలేదనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే హక్కు లేదు. దానికి కారణం ఈ బిల్లును రూపకల్పన చేసింది మొదట వాళ్లే. అలాంటప్పుడు చరిత్ర తడిమితే బిల్లును పాస్ చేసుకోలేకపోవడం ఒక సత్యం అయితే, ఆ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమే అవుతుంది.

రాహుల్ గాంధీ మహిళా బిల్లు మీద చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో సామాజిక న్యాయం అంశంలో, బీసీ మహిళల రిజర్వేషన్ విషయంలో చాలా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కులాధార జనాభా లెక్కల ప్రక్రియను చేసిందని, అది కొన్ని కారణాలు వల్ల ఆ డేటాను బయట పెట్టలేక పోయిందని చెప్పారు‌. అయితే 2010లో మహిళా బిల్లు రాజ్యసభలో పాసై లోక్ సభలో వీగిపోయింది. దీనికి కారణం బిల్లులో ఓబీసీ (OBC) మహిళలకు సబ్ కోటా కల్పించకపోవడం. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించి ఉంటే, సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ మొదలైన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపేవి. బిల్లు అప్పుడే పాస్ అయ్యేది. కానీ అలా జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోంది.

శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2010 ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ (OBC) మహిళలకు చోటు కల్పించకపోవడం 100% తప్పిదమని, తాము దానికి నూరు శాతం పశ్చాత్తాపం పడుతున్నామని అన్నారు. ఈ పశ్చాత్తాపానికి 13 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడు అవకాశం వస్తుందో, ఎప్పుడు చరిత్రలో ఒక సందర్భానికి కాలం పిలుపునిస్తుందో, ఆ పిలుపును సకాలంలో ఎవరు అందిపిచ్చుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు‌ ఇప్పుడు రాహుల్ గాంధీ పశ్చాత్తాపం ప్రకటించినా, జరిగిపోయిన చరిత్రను, కరిగిపోయిన కాలాన్ని ఎవరూ మార్చలేరు. అయితే ఇంతకాలానికైనా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం పట్ల, జనాభా లెక్కల కులాధార ప్రక్రియ పట్ల మౌలికమైన మార్పులు కనిపించడం ఒక సంతోషదాయకమైన పరిణామం.

ఏది ఏమైనప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి ఆ ఘనతను బిజెపి దక్కించుకుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ చేజేతులా చేజార్చుకుంది. ఇది చరిత్ర. దీన్ని ఎవరైనా అంగీకరించక తప్పదు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ గాని, మరి ఇతర ప్రతిపక్షాలు గాని, అధికారంలో ఉన్న బిజెపి వారు గానీ ఈ మహిళా రిజర్వేషన్ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేసి అమలులోకి తెస్తే కాలం క్షమిస్తుంది. జో జీతా వహీ సికందర్ అంటారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ ప్రయత్నాల్ని తుది పరిణామం వైపు ఎవరు తీసుకువెళ్తారో వాళ్లే విజేతలు. కనుక గడిచిన కాలాన్ని తడుముకుని కూర్చుంటే లాభం లేదు‌. ఇప్పటికైనా చట్టసభల్లో ఓబీసీ మహిళలకే కాదు, ఓబీసీ పురుషులకు కూడా దక్కాల్సిన వాటా దక్కడానికి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ ప్రయత్నించాలి. కేవలం మాటలతో వాగ్దానాలతో కంటిచూపు చర్యలతో ఇది సాధ్యం కాదు. తక్షణమే కులం ఆధారంగా జనగణన ప్రక్రియ పూర్తి చేసి, పార్లమెంటు శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగవంతం చేసి, పార్లమెంటులోనూ శాసనసభల్లోనూ ఓబీసీలకు తక్షణ న్యాయం జరిగేటట్టు చూస్తే అప్పుడు రాజకీయ నాయకులను సమాజం అంగీకరిస్తుంది. సామాజిక న్యాయం పట్ల వారి చిత్తశుద్ధి ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది.

Also Read:  Ayodhya Airport BluePrint : ‘మర్యాద పురుషోత్తమ శ్రీరామ’ ఎయిర్‌పోర్టు.. డిసెంబరు నుంచే సేవలు

Exit mobile version