Rajagopala Chidambaram: మన దేశం నిర్వహించిన పోఖ్రాన్-1, పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ అణు శాస్త్రవేత్త, క్రిస్టలోగ్రాఫర్ డాక్టర్ రాజగోపాల చిదంబరం శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. గత కొన్ని రోజులుగా రాజగోపాల చిదంబరం ఆరోగ్యం బాగా లేదు. డాక్టర్ చిదంబరం(Rajagopala Chidambaram) శాస్త్రవేత్తగా తన కెరీర్‌లో భాగంగా.. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ (AEC) ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) కార్యదర్శిగా పనిచేశారు.
Also Read :Telangana BJP Chief : కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ .. రేసులో ఎనిమిది మంది
డాక్టర్ రాజగోపాల చిదంబరం 1994-95 సమయంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) గవర్నర్స్ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఆయన భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా కూడా సేవలు అందించారు. భారతదేశం అణ్వాయుధ కార్యక్రమంలో డాక్టర్ చిదంబరం కీలక పాత్ర పోషించారు. 1975 సంవత్సరంలో పోఖ్రాన్-I అణు పరీక్ష, 1998లో పోఖ్రాన్-II అణు పరీక్ష జరిగాయి. ఆ అణు పరీక్షల కోసం వివిధ విభాగాలను సమన్వయం చేసే కీలక విధులను డాక్టర్ రాజగోపాల చిదంబరం నిర్వర్తించారు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసమే ఉపయోగించాలని ఆయన వాదించేవారు. భారతదేశ అణుశక్తి కార్యక్రమాన్ని వేగవంతం చేసిన సైంటిస్టుగా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. డాక్టర్ చిదంబరంను భారతదేశం 1975లో పద్మశ్రీ పురస్కారంతో, 1999లో పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించుకుంది.
Also Read :India vs Australia : చెలరేగిన నితీశ్.. 181 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
భారత్‌కు అణ్వస్త్రాలపై రాజగోపాల చిదంబరం ఏమన్నారంటే..
ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ మీడియా సంస్థకు డాక్టర్ రాజగోపాల చిదంబరం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన అణ్వాయుధాల తయారీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘1998 సంవత్సరంలో భారతదేశం పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించిన తర్వాత ఇద్దరు అమెరికా రచయితలు సీఈ పాయిన్, ఎంజీ మెక్‌కింజీ ఓ సంచలన వ్యాసాన్ని రాశారు. అందులో ఒక వెన్ డయాగ్రామ్‌ను వాళ్లు పబ్లిష్ చేశారు. అణ్వాయుధాలను తయారు చేసుకున్న ప్రతీ దేశానికి.. అప్పటికే అణ్వాయుధాలను కలిగిన ఏదో ఒక దేశం నుంచి సాయం లభించిందని అందులో చూపించారు. ఇలా అణ్వాయుధ దేశాలుగా మారిన వాటికి సమాచారం రహస్యంగా చేరవేయబడి ఉండొచ్చని, లేదంటే దాన్ని దొంగిలించి ఉండొచ్చని వ్యాసంలో రచయితలు ప్రస్తావించారు. అమెరికా, బ్రిటన్ అణ్వాయుధాల తయారీలో రహస్యంగా కలిసి పనిచేశాయని అందులో ఉంది. చైనా, రష్యా దేశాలు.. చైనా, పాకిస్తాన్ దేశాలు.. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు.. ఫ్రాన్స్, ఇజ్రాయెల్ మరో నాలుగు దేశాలు అణ్వాయుధాల తయారీలో ఏదో ఒక రకంగా కలిసి పనిచేశాయని ఆ రచయితలు రాశారు. భారత్‌కు వాటిలో ఏ ఒక్క దేశంతోనూ లింక్ లేదు. మన భారతదేశం ఎవరి నుంచి కూడా అణ్వాయుధాల తయారీ టెక్నాలజీని దొంగిలించలేదు. ఎందుకంటే మనకు సొంతంగా అణ్వస్త్రాల తయారీ సత్తా ఉంది’’ అని డాక్టర్ రాజగోపాల చిదంబరం వివరించారు.