Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. నామపత్రాలు దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 21ను నిర్ధారించింది. అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగ్‌దీప్ ధన్‌ఖడ్ గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2027 ఆగస్టు వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, ఆరోగ్య కారణాల వలన ముందుగానే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే.
Read Also: Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్ టారిఫ్‌ల పై స్పందించిన ప్రధాని మోడీ
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రకటనలో మరిన్ని వివరాలు వెల్లడించారు. ఈ ఎన్నికను రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారి హోదాలో నిర్వహించనున్నారు. ఆయనకు సహాయంగా మరో ఇద్దరు అధికారులు వ్యవహరించనున్నారు. ఎన్నికల సమయానికి సంబంధించిన ప్రణాళికలను ఆయనే సమన్వయం చేస్తారు. ఇక, ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు మాత్రమే ఉంటుంది. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు కూడా ఓటు వేయగలరని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా, వీటిలో 233 మంది ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఇక లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. అయితే, ప్రస్తుతం రాజ్యసభలో 5, లోక్‌సభలో 1 స్థానం ఖాళీగా ఉంది. ఈ కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్ హక్కు కలిగిన సభ్యుల సంఖ్య 782గా ఉంది.
గెలుపొందేందుకు అభ్యర్థి మెజారిటీ ఓట్లు పొందాలి. అంటే మొత్తం ఓటర్లలో కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అందరూ ఓటు వేస్తే, గెలుపు కోసం కనీసం 391 ఓట్లు అవసరం అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటింగ్ రహస్యంగా జరగనుండగా, పార్టీల విప్ అమలులో ఉండదు. ప్రతి సభ్యుడు తన ఇష్టానికి అనుగుణంగా ఓటు వేయగలడు. ఓటింగ్ తరువాత అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీల మధ్య సంప్రదింపులు ప్రారంభమైనట్లు సమాచారం. ఏ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందన్న దానిపై అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. బీజేపీ నాయిత్యం కలిగిన ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపుతారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. విపక్ష కూటమి INDIA కూడా తమ అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే, వచ్చే సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజకీయంగా మార్గదర్శకంగా మారే అవకాశముంది. అందువల్ల అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ఈ ఎన్నికలో పాల్గొననున్నాయి.