Site icon HashtagU Telugu

Taj Mahal : తాజ్ మహల్ కు నోటీసులు..!

Taj Mahal Notice ASI Agra

Taj

చారిత్రక కట్టడం తాజ్ మహల్ (Taj Mahal) కు ఆస్తి పన్ను చెల్లించాలంటూ అధికారులు నోటీసులు పంపారు. పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్లును కూడా వెంటనే చెల్లించాలని సూచించారు. నిర్ణీత టైం లోగా బిల్లులు చెల్లించకుంటే తాజ్ ను సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కు నోటీసులు పంపారు. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన నిర్వాకమిది. నోటీసులు అందుకున్న ASI అధికారులు అవాక్కయ్యారు.

నోటీసులు అందుకోవడం ఇదే తొలిసారి అని, పొరపాటుగా జరిగి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే పురాతన, చారిత్రక కట్టడాలకు పన్నులు వర్తించవని వివరించారు. వాటర్ బిల్లు కూడా తాజ్ కు వర్తించదని అధికారులు పేర్కొన్నారు. తాజ్ మహల్ (Taj Mahal) ఆవరణలో పచ్చదనాన్ని కాపాడేందుకు నీటిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, తాజ్ మహల్ కు సంబంధించి రూ.1.9 కోట్ల ఆస్తి పన్ను, రూ.1.5 లక్షల వాటర్ బిల్ పెండింగ్ లో ఉన్నాయి.

దీనిపై కమిషనర్ నిఖిల్ స్పందిస్తూ.. ఆగ్రా మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ డ్రైవ్ ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (GIS) సర్వే చేసి, పన్నులు లెక్కించామని వాటి ఆధారంగా ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కట్టడాలకు నోటీసులు పంపామన్నారు. ASI నుంచి వచ్చే జవాబు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని  వివరించారు.

Also Read:  Papikondalu : పర్యాటకుల కోసం ఏపీ టూరిజం.. పాపికొండలు టూర్ ప్యాకేజీ