Site icon HashtagU Telugu

Weather Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ

Weather Alert

Weather Alert

Weather Alert: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు సంభవించాయి. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.

ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఏడుగురి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. ఘటన సమయంలో 29 మంది హోటల్‌లో ఉండగా, అధికారులు 20 మందిని సురక్షితంగా బయటకు రక్షించారు.

భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా 24 గంటల పాటు నిలిపివేశారు. రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, దేహ్రాదూన్, నైనీతాల్, తెహ్రీ ప్రాంతాల్లో యాత్రికులను నిలిపివేయాలని స్థానిక అధికారులకు సూచించారు. వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇక జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరద నీటిలో మునిగిన ఆశ్రమ పాఠశాలలో చిక్కుకుపోయిన 162 మంది విద్యార్థులను స్థానికులు, అధికారులు కలిసి సురక్షితంగా బయటకు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాది రాష్ట్రాల కోసం రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని కేంద్రం ఆదేశించింది.

Bangladesh : బంగ్లాదేశ్‌లో 21 ఏళ్ల హిందూ మహిళపై అత్యాచారం