NEET UG Result : ఈసారి వెలువడిన నీట్ యూజీ ఫలితాలపై(NEET UG Result) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఫలితాల్లో అసాధారణ వ్యత్యాసమేదీ లేదని స్ఫష్టం చేసింది. ఈమేరకు తమ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 2020 నుంచి 2024 వరకు జరిగిన నీట్ పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన సగటు మార్కులు దాదాపు ఒకే రేంజులో ఉన్నాయని ఎన్‌టీఏ తెలిపింది. సగటు స్కోర్‌కు అనుగుణంగానే కటాఫ్ మార్కులు ఉన్నాయని.. వాటితో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన నీట్ యూజీ ఫలితాల్లో పెద్ద తేడా ఏదీ లేదని వివరించింది. పరీక్షకు ఉన్న పోటీ, అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ప్రతి ఏడాది కటాఫ్ మార్కులను నిర్ణయిస్తుంటారని ఎన్‌టీఏ గుర్తు చేసింది.
We’re now on WhatsApp. Click to Join
2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి వ్యాపించిన టైంలో 13.6 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారని, మొత్తం 720 మార్కులకుగానూ వారికి సగటు స్కోర్ 297.18 వచ్చిందని ఎన్‌టీఏ పేర్కొంది. అప్పుడు జనరల్ కేటగిరీ కటాఫ్ మార్కులు 147 వచ్చాయని గుర్తు చేసింది. ఈసారి నీట్ యూజీ పరీక్షలో సగటు స్కోర్ 323.55 కాగా.. క్వాలిఫైయింగ్ మార్కులు 164 అని కోర్టుకు ఎన్‌టీఏ తెలిపింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 23.33 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారని వెల్లడించింది. పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన కేంద్రాల్లో కూడా విద్యార్థుల మార్కుల్లో పెద్ద వ్యత్యాసం లేదని ఎన్‌టీఏ(NTA) స్పష్టం చేసింది.
Also Read :Phone Tapping Case : వ్యక్తిగత జీవితాలపై రాద్ధాంతం చేయొద్దు.. మీడియాకు హైకోర్టు ఆదేశాలు
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై దాఖలైన 38 పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 8 నుంచి విచారిస్తోంది. పేపర్ లీకైనమాట వాస్తమేనని స్వయంగా సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవల వెల్లడించింది. నీట్ ఫలితాల్లో 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే.