Nitish – Modi : మోడీ సర్కారుకు నితీశ్ మెలిక.. ఆ ‘హోదా’ కోసం తీర్మానం!

కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కింగ్ మేకర్‌గా మారిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చక్రం తిప్పడం మొదలుపెట్టారు.

  • Written By:
  • Updated On - June 29, 2024 / 04:16 PM IST

Nitish – Modi : కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కింగ్ మేకర్‌గా మారిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఈక్రమంలో ఆయన పార్టీ జేడీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన  జేడీయూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమైన తీర్మానం చేశారు. బిహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ తీర్మానంలో డిమాండ్ చేశారు. ఒకవేళ బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇచ్చే పరిస్థితి లేకుంటే  ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని జేడీయూ(Nitish – Modi)  డిమాండ్ చేసింది. ఈవిషయాన్ని కూడా జేడీయూ తమ తీర్మానంలో ప్రస్తావించింది. జేడీయూ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదు. రాష్ట్ర వృద్ధి పథం వేగవంతం కావాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరిగా అవసరం. బిహార్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కూడా ప్రత్యేక హోదా అవసరం’’ అని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

జేడీయూ ఇతర తీర్మానాల జాబితాలో.. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలనే డిమాండ్ కూడా ఉంది. ప్రవేశ పరీక్షలు, పోటీ  పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయాలని జేడీయూ  కోరింది. బిహార్‌లో ఇటీవల 65 శాతానికి పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో ప్రస్తావించారు. న్యాయపరమైన పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో రిజర్వేషన్‌ కోటాను చేర్చాలని జేడీయూ కోరింది. ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని జేడీయూ హామీ ఇచ్చింది.

Also Read :Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్‌ గతేడాది నవంబరులోనే ఆమోదించింది. అయితే అప్పట్లో నితీశ్ కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ మద్దతుతో బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం నడిపేవారు.  ఈ ఏడాది జనవరిలోనే అనూహ్యంగా నితీశ్ కుమార్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన ఎన్డీయే కూటమిలో చేరారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో 12 సీట్లు వచ్చిన జేడీయూ, 16 సీట్లు వచ్చిన టీడీపీ కింగ్ మేకర్లుగా మారాయి. దీంతో ఈ రెండు పార్టీలు ఈదఫా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాయి. ఈనేపథ్యంలో బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను జేడీయూ లేవనెత్తడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.  దీనిపై బీజేపీ అధినాయకత్వం, ఎన్డీయే సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.