Nitish With Modi: నితీష్ జంప్.. మళ్లీ ఎన్డీఏ గూటికి.. 4న ప్రధాని మోడీతో సభ

Nitish With Modi :  బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమికి బైబై చెప్పి.. మళ్లీ ఎన్డీఏ గూటిలో చేరబోతున్నారు.

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 08:01 AM IST

Nitish With Modi :  బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమికి బైబై చెప్పి.. మళ్లీ ఎన్డీఏ గూటిలో చేరబోతున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ఇండియా బ్లాక్‌తో సంబంధాలను తెంచుకోగా.. ఇప్పుడు నితీష్ కూడా అదే బాటలో కనిపిస్తున్నారు. ఎన్డీఏతో తన కలయికకు సంకేతంగా  ఫిబ్రవరి 4న బిహార్‌లోని బెట్టియాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీతో కలిసి నితీష్ కుమార్(Nitish With Modi) వేదికను పంచుకునే ఛాన్స్ ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో బీజేపీతో జట్టుకట్టిన తర్వాత బిహార్ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పోయేందుకు నితీష్ కుమార్ రెడీ అవుతారని తెలుస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటే బిహార్ అసెంబ్లీ పోల్స్ జరుగుతాయని తెలుస్తోంది. మరో వాదన ప్రకారం.. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు  122 సీట్ల బలం అవసరం. ఇందులో ఆర్జేడీకి అత్యధికంగా 79 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 82 సీట్లు, నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి 45 సీట్లు ఉన్నాయి. బీజేపీ, జేడీయూ కలిసి కొత్త సర్కారును ఏర్పాటు చేస్తాయనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. బిహార్‌లో అసెంబ్లీ రద్దవుతుందా ? బీజేపీ, జేడీయూ కలయికతో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా ? అనేది ఇంకొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. ఈ అంచనాలకు బలం చేకూరుస్తూ సీఎం నితీష్ కుమార్‌పై విమర్శలు చేయొద్దంటూ తమ పార్టీ బిహార్ శ్రేణులకు బీజేపీ జాతీయ నాయకత్వం సూచనలు జారీ చేసింది. ఈ రాజకీయ గందరగోళం నడుమ శనివారం సాయంత్రం గోవాకు వెళ్లాల్సిన బిహార్ గవర్నర్ తన ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. బిహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి,  బీహార్ సీనియర్ నాయకుడు సుశీల్ మోడీలను  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీకి పిలిపించారు. వారిద్దరు ఇవాళ సాయంత్రం జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యే  అవకాశం ఉంది. ఈసారి కూడా నితీష్ కుమార్ మహా ఘట్బంధన్ కూటమి నుంచి ఎన్డీఏలోకి జంప్ అయితే.. 2013 నుంచి ఇప్పటివరకు ఆయన కూటములు మారడం ఇది ఐదోసారి అవుతుంది.

Also Read :Gyanvapi Mosque : హిందూ ఆలయంపైనే జ్ఞానవాపి మసీదు.. ఏఎస్‌ఐ సంచలన నివేదిక

బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర సర్కారు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వాలని మేం ఎన్నో దశాబ్దాల పాటు  డిమాండ్ చేశాం. అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు వినిపించుకోలేదు. బీజేపీ మాత్రం ఆ పనిచేసి చూపించింది. ప్రధాని మోడీకి, కేంద్ర సర్కారుకు నా ధన్యవాదాలు’’ అని చెప్పారు.  ఎన్డీఏలోకి వెళ్తాననే సంకేతాలను పంపేలా నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.